Janasena Party Plenary In Pithapuram : మొన్నటి సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని తాను పోటీచేసేందుకు ఎంపిక చేసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో పోటీ చేసిన 21 స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలను గెలిచి జయకేతనాన్ని ఎగుర వేశారు. జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇప్పుడు అదే నియోజకవర్గంలో నిర్వహించి తద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడంతోపాటు పిఠాపురం సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడలో ఈనెల 14న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జయకేతనం అనే పేరు ఫిక్స్‌ చేశారు అధినేత పవన్‌ కల్యాణ్‌. ఇదే విషయాన్ని జనసేన పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.  


2024లో పార్టీ జయకేతనం...
2024ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కూటమిగా జతకట్టిన జనసేన పార్టీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. 175 నియోజకవర్గాలకుగాను కేవలం 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు తీసుకోవడంపై అప్పట్లో జనసేనపై చాలా విమర్శలు వచ్చాయి. 


ప్రత్యర్థి వైసీపీ అయితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీకు అమ్ముడుపోయారంటూ బహిరంగ విమర్శలు చేసింది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ఫలితాల్లో తన పార్టీకు వచ్చిన నూరు శాతం విజయంతో అందరి నోర్లు మూయించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్న క్రమంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. దీనికి తోడు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో 70 వేలకుపైగా ఓట్లు అధిక్యాన్ని సాధించి విజయకేతనం ఎగురవేశారు..  




చిత్రాడ సభకు జయకేతనంగా నామకరణం..
జనసేన పార్టీ ఏర్పడి 12 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ఈ వేడుకును తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే ఏర్పాటు చేసేందుకు అధినేత పవన్‌ నిర్ణయించడంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టి పిఠాపురంపైనే పడింది. పార్టీ శ్రేణుల అన్ని దారులు పిఠాపురం వైపే పయనిస్తున్నాయి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉన్న చిత్రాడ ఎస్బీ వెంచర్స్‌లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మార్చి 14వ తేదీన చిత్రాడలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ సభకు జయకేతనం సభగా పవన్‌ కల్యాణ్‌ నామకరణం చేయడం విశేషం. 


పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంపై ఆసక్తి..
పార్టీ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి విజయకేతనం సభ వేదికగా పార్టీ అధినేత పవన్‌ చేయబోయే ప్రసంగంపై అంతా ఆసక్తి నెలకొంది. సభా వేదిక వద్దకు పవన్‌ సాయంత్రం 4గంటలకు చేరుకుంటారని, అనంతరం సభాప్రాంగణం వద్దనే ఏర్పాటు చేసిన మీటింగ్‌ హాలులో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమావేశమవుతారు. అనంతరం జరగబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈసారి పవన్‌ కల్యాణ్‌ చేయబోయే ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది..