Heavy Floods: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం పూర్తిగా వరద ముంపులోకి వెళ్ళింది. పుణ్యక్షేత్రం గర్భగుడిని వరద నీరు తాకింది. 1986లో కూడా ఇలాగే వరద నీరు గర్భగుడిని తాకిందని... మళ్లీ ఎప్పుడూ ఇలా జరగలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి ఏటా వరదలు వస్తున్నా... ఈ సంవత్సరం మాత్రం ముంపు ముప్పు ఎక్కువగా ఉందంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత స్వామి వారిని గర్భగుడిని వరద నీరు తాకడం చూస్తున్నామని ఆలయ అర్చకులు వవరిస్తున్నారు. 


వరద తగ్గాకే దర్శనాల పునరుద్ధరణ..


అయితే వరద ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే దర్శనాలను పునరుద్ధరిస్తామని అప్పనపల్లి శ్రీ బాలాజీ దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రజలు దైవ దర్శనం కోసం ఇక్కడకు రావద్దని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కోనసీమ మొత్తం జలదిగ్బంధంలోనే ఉంది. మోకాళ్ల లోతు నీటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇంకా వరద ప్రభావం పెరిగితే... ప్రజలు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అప్పనపల్లి గ్రామస్థులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 


20 లీటర్ల నీళ్ల క్యాన్లు ఇవ్వండయ్యా..


తాగేందుకు నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. అయితే ప్రభుత్వం వీరికి సాయంగా ఆహారం పొట్లాలు, వాటెర్ ప్యాకెట్లు ఇస్తోంది. కానీ తాగేందుకు ఆ వాటర్ ప్యాకెట్లు ఏమాత్రం సరిపోవడం లేదని... కనీసం 20 లీటర్ల ఉండే వాటర్ క్యాన్లలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వరదలు వచ్చిన ప్రతీ సారి తమ పరిస్థితి ఇలాగే ఉంటోందని అప్పనపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదు..


కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా అవకాశాలు ఉండవని... అప్పనపల్లి గ్రామంలో ప్రతి వీధిలోను మోకాల్లోతు నీటిలో ఇబ్బంది పడుతుంటామన్నారు. దురదృష్ట వశాత్తు ఈ సమయంలో ఎవరన్నా కాలం చేస్తే.. మా పాట్లు వర్ణనా తీతమని వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు మృతదేహాన్ని తీసుకెళ్లి అక్కడ దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. ఎంత పేదవారైనా సరే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని తమ బాధను వెళ్లగక్కుతున్నారు. చివరి మజిలీ లోనైనా ప్రభుత్వం సహకారం చేస్తే బాగుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 


ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి..


మామూలు రోజుల్లో ప్రభుత్వ సాయం లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం సర్కారు ఖచ్చితంగా అండగా ఉండాలని అంటున్నారు. మోకాళ్ల లోతు నీటిలోనే చిన్న పిల్లలు, పండు ముసలి వాళ్లను పట్టుకొని విపరీతమైన పాట్లు పడుతున్నామన్నారు. తినేందుకు తిండి సరిగ్గా లేక, తాగేందుకు నీళ్లు లేక నరకం చూస్తున్నామన్నారు. నిన్నటి నుంచి కాస్త వర్షం తగ్గినప్పటికీ.. వరదలు ఏమాత్రం తగ్గడం లేదని చెప్తున్నారు. వరదలు పూర్తిగా తగ్గి.. పూర్వ పరిస్థితులు ఏర్పడే వరకు... ప్రభుత్వం తమకు సాయంగా నిలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.