భవిష్యత్తులో వరదలు వచ్చినా తట్టుకునేలా.. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపే వ్యవస్థను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వరదల్లో బాధితులకు బాసటగా నిలిచి అధికారులు,  సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, సిబ్బంది బాగా పనిచేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కితాబు ఇచ్చారు.  కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన అనంతరం ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్రవరం మంగళవారం రాత్రి చేరుకుని అధికారులు, మంత్రులతో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సమీక్షించారు. వరదల వేళ చేపట్టిన చర్యలు, పునరావాస కేంద్రాలు, సహాయక చర్యలపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సీఎంకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నివేదికను జేసీ మురళి ముఖ్యమంత్రికి వివరించారు. 


 రాజమండ్రికి సీఎం భరోసా
అఖండ గోదావరి గట్లు కొన్ని చోట్ల బలహీన పడిన నేపథ్యంలో ఆ ప్రాంతాలను గుర్తించి రాజమండ్రి నగరంలోకి గోదావరి వరద నీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రనివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి ఏటిగట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాలు గుర్తించి నవంబరు నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


పటిష్ఠ బందోబస్తు నడుమ సీఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉబయ గోదావరి జిల్లాల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేవలం అధికారులు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. మీడియాకు అనుమతి ఇవ్వలేదు.  రాత్రి రాజమండ్రిలోనే బస చేసిన సీఎం బుధవారం ఉదయం ఏజెన్సీ బయలు దేరి వెళ్లారు. మంత్రులు తానేటి వనిత,  వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, గుడివాడ అనుర్ నాథ్, పినిపే విశ్వరూప్,  కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కం పూడి రాజా జి. శ్రీనివాసరావు, సత్తి సూర్యనారాయణ రెడ్డితో పాటు అధికారులు ఉన్నారు.