PM Modi on Cyclone Montha: చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్.. మొంథా తుపాను ప్రభావంపై ఆరా, సాయం చేస్తామని భరోసా
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. కేంద్ర సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

Cyclone Montha: అమరావతి: ఊహించినట్లుగానే ఏపీలో పలు జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం చూపుతోంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరుతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ, విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.
మొంథా తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండండి ప్రఖర్ జైన్ సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్
మొంథా తుఫాన్ ఏపీపై ప్రభావం చూపుతున్న తరుణంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. మొంథా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా తీశారు. తుఫాన్ సమయంలో కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సీఎం కార్యాలయంలో సమన్వయ బాధ్యతను కూటమి ప్రభుత్వం మంత్రి లోకేష్ కి అప్పగించింది. సీఎం ఆఫీసు నుంచే తుఫాన్ ప్రభావంపై లోకేష్ అందరు మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలను, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తున్నారు. మొంథా తుపాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడూ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, వరద పరిస్థితిపై సీఎం ఆఫీసుకు అప్ డేట్ ఇవ్వాలని సూచించారు.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.#Weather #Cyclone #AndhraPradeh #APSDMS #NDRF #SDRF #Rains #HeavyRains… pic.twitter.com/ieH91EaymD
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 27, 2025
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలం కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి తుపాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు కలెక్టర్ వినోద్‌కుమార్, తుపాను ప్రత్యేక అధికారి వేణుగోపాల్‌రెడ్డి. ఏమైనా సాయం కావాలంటే బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్ 08643 220226కు ఫోన్ చేయాలని అధికారులకు సూచించారు. సూర్యలంక బీచ్‌కు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. నిత్యావసర సరకులు, అత్యవసర మందులను అధికారులు సిద్ధం చేశారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు.
మొంథా తుపాను దృష్ట్యా అక్టోబర్ 30 వరకు అధికారులకు సెలవులు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సహాయ చర్యల నిమిత్తం రూ.19 కోట్లు విడుదల చేసి తుపాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధమైంది. ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లు.. సముద్రంలో 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించి కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరులో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. ప.గో, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు.





















