Chandra Babu Naidu Got Interim bail : స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. ఆయన ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్  మంజూరు చేసింది. ఇందులో షరతులూ కూడా పెట్టింది. 


విడుదల ప్రక్రియ మొదలు పెట్టిన తెలుగుదేశం పార్టీ 


బెయిల్‌పై విడుదలకు సంబంధించిన ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మొదలు పెట్టింది. లక్షరూపాయల బాండ్ పేపర్లను రెడీ చేస్తోంది. ఇద్దరు షూరిటీల సంతకాలను తీసుకుంటోంది. ఎలాగైనా సాయంత్రం ఐదు గంటల కల్లా చంద్రబాబును బయటకు తీసుకురావాలనే ఆలోచనతో టీడీపీ ఉంది. అందుకే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అయితే చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఏం జరగబోతోంది అనే చర్చ కూడా మొదలై పోయింది.  


సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం 


అన్ని అనుకున్నట్టు జరిగితే సాయంత్రం 5గంటల తర్వాత చంద్రబాబునాయుడు 52రోజుల జైలు జీవితం అనంతరం రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు రానున్నారు. చంద్రబాబు బయటకు రాగానే ఏం చేయాలనే విషయాలను ఆయన కుటుంబసభ్యులు ఇప్పటికే ప్లాన్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి రానున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ కూడా సిద్ధమైంది. 


చంద్రబాబు నాయుడు వచ్చే రూట్ మ్యాప్
రాజమండ్రి టూ విజయవాడ(పాత హైవే)
వేమగిరి(రాజమండ్రి, అనపర్తి)
రావులపాలెం(కొత్తపేట, మండపేట)
పెరవలి(నిడదవోలు)
తణుకు(తణుకు, ఆచంట)
తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలం,(గోపాలపురం)
భీమడోలు(ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలం(గోపాలపురం)
దెందులూరు(దెందులూరు)
ఏలూరు(ఏలూరు)
హనుమాన్ జంక్షన్(గన్నవరం, నూజివీడు, గుడివాడ)
గన్నవరం(గన్నవరం)
విజయవాడ(విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్)


వైద్యం ఎక్కడ చేయించుకుంటారో?


కోర్టు ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు విదేశాలకు వైద్యం కోసం వెళ్తారా లేదా హైదరాబాద్‌లోనే వైద్యం చేయించుకుంటారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాల్లో కేసును, సాక్ష్యులను ప్రభావితం చేసే పనులు చంద్రబాబు చేయొద్దని స్పష్టం ఉండటంతో కేసు విషయంలో ప్రెస్‌మీట్‌ పెట్టే ఛాన్స్‌ లేదు. అయితే ఇతర అంశాలపై ఏమైనా మాట్లాడతారా లేకుంటే కేసు అంశాలు కోర్టుల్లో తేలే వరకు సైలెంట్‌గా ఉంటారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. 


యుద్ధం మొదలైందని లోకేష్ హాట్ కామెంట్స్ 


ఇప్పటికే బెయిల్ అంశంపై నేతలతో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ యుద్ధం ఇప్పుడే మొదలైందని అన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వైపు తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరమైన తెలంగాణ టీడీపీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారు. మరోవైపు ముంచుకొస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు, వెంటాడుతున్న కేసులు ఇలా నలువైపుల నుంచి సమస్యల సుడిగుండంలో ఉన్న పార్టీని చంద్రబాబు ఏ తీరానికి చేరుస్తారో అన్న ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది. 50 రోజులు పార్టీకి ఫ్యామిలీకి, నేతలకు దూరంగా ఉన్న ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా నిర్దేశం చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.


Also Read: చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌లో హైకోర్టు చెప్పిన షరతులు ఇవే


Also Read: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట- స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు