Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన కూటమి ప్రభుత్వం

Door Delivery Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి సీఎం చంద్రబాబు సాయం అందజేశారు.పెండింగ్ పింఛన్‌, పరిహారం పంపిమీ చేశారు.

Continues below advertisement
AP GOVT HELP: వైసీపీ ఎమ్మెల్సీ  అనంతబాబు(Anatha Babu)  కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం  దారుణ హత్య,  మృతదేహం డోర్‌ డెలీవరీ అంశం అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అధికార పార్టీ నాయకుడి అరాచకాలను ఎదురొడ్డి ఆ పేద కుటుంబం న్యాయం కోసం పోరాడింది. బెదిరింపులకు  తలొగ్గకుండా న్యాయపోరాటం చేసింది. ఫలితంగా రెక్కాడితో  డొక్కాడని ఆ బడుగు జీవులపై  అప్పటి ప్రభుత్వం కక్షగట్టి మరీ పింఛన్‌ సొమ్ములు నిలిపివేసింది. పైగా కోర్టు ఖర్చులు, రాకపోకల ఖర్చులు తడిసి మోపడయ్యాయి. 
 
హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు
పేదరికంతో అల్లాడుతున్న సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని  కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఒకరకంగా టీడీపీ(TDP) అధికారంలోకి రావడానికి ఉడతాభక్తి సాయంగా  ఉపయోగపడిన  సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకంటూ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చంద్రబాబు(Chandra Babu) సాయం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ(MLC) అనంతబాబు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురికాగా....మృతదేహాన్ని  అనంతబాబే నేరుగా డ్రైవర్‌ ఇంటి వద్ద డోర్‌ డెలీవరీ(Door Delivery) చేశాడు.దీనిపై పెద్దఎత్తున ఆందోళన జరగ్గా.....అనంతబాబు జైలుపాలయ్యాడు. అప్పట్లో సుబ్రహ్మణ్యం కుటుంబానికి  నాటి సీఎం జగన్ ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చినా....ఒక్క రూపాయి ఇవ్వలేదు.
 
పింఛన్‌ బకాయిలు, పరిహారం సొమ్ము అందజేత
వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చి మరిచిన విషయాన్ని  న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన సీఎం (CM)పరిహారం పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ కుటుంబానికి బకాయి  ఉన్న పింఛన్‌ సొమ్ము రూ.1,20,438లతో పాటు ..ఎస్సీ, ఎస్టీ ఛార్జిషీటు పరిహారం రూ.2,06,250 సొమ్మును అధికారులు బ్యాంకులో జమ చేశారు. ఆపదలో కూటమి  ప్రభుత్వం ఆదుకుందని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు  సత్యనారాయణ, నూకరత్నం  ఆనందం వ్యక్తం చేశారు.
 
చెట్టంత ఎదిగిన కొడుకుని దుర్మార్గులు దారుణంగా కొట్టి చంపేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. జీవితచరమాంకంలో అండంగా ఉంటాడని భావిస్తే...అనంతబాబు ఆ అనంత లోకాలకు పంపించేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని  కిరాతకంగా  హత్య చేసిన నిందితులు ఇంకా ఆనందంగా బయటే తిరుగుతున్నారని...వెంటనే అనంతబాబు బెయిల్ రద్దు చేసి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుబ్రహ్మణ్యంను  హత్య చేయడం అనంతబాబు ఒక్కడితోనే సాధ్యంకాదని....అతనికి సహకరించిన  సహచరులనూ అరెస్ట్ చేయాలని తల్లిదండ్రులు కోరారు. వారందరికీ శిక్షపడితేనే  తమ కుమారుడి ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి తమకు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు,  దళిత నాయకుడు పిట్టావరప్రసాద్‌  అండగా ఉన్నారని...తమ తరఫున పోరాడారని  తెలిపారు. తమకు అండగా నిలిచిన వారందరికీ  సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పింఛను, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
 
ఎవ్వరినీ వదిలిపెట్టం

వైసీపీ హయాంలో అధికారం అండతో రెచ్చిపోయిన ప్రతిఒక్కరిపైనా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.  ప్రభుత్వం ఎవరిపైనా కక్షసాధింపు  చేయదని...చట్టప్రకారమే దోషులకు శిక్షపడుతుందని ఆయన తెలిపారు. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఏ ఒక్కరినీ  వదిలిపెట్టేది లేదిని తేల్చిచెప్పారు

Continues below advertisement