పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట రెగ్యులేటర్ వద్ద పూజలు చేసి దీనిని ప్రారంభించారు.
Godavari Water to North Andhra: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదల.. గోదారమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం
Andhra Pradesh Top News | పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు గోదావరి నీటిని విడుదల చేశారు. జలహారతి ఇచ్చి, పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి తల్లికి సాష్టాంగ నమస్కారం చేశారు.

- పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు గోదావరి జలాలను విడుదల చేశారు.
- ఉత్తరాంధ్రకు నీరు తరలించి సుదీర్ఘ స్వప్నాన్ని నెరవేర్చారు.
- రూ.4038 కోట్లతో కాలువ పనులు పూర్తిచేసి నీటిని మళ్లించారు.
- లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించి ఉపశమనం.
పాయకరావుపేట: ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గోదావరి నీటిని విడుదల చేశారు. కాలువలో 111వ కిలోమీటర్ వరకు ముందుగానే నీటిని తరలించి నిల్వ ఉంచగా, పాయకరావుపేట రెగ్యులేటర్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు. జలహారతి అనంతరం గోదావరి జలాలకు సాష్టాంగ నమస్కారం చేసి చల్లగా చూడాలని ప్రార్తించారు.

పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అంతకంటే ముందే ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తరలించే ప్రక్రియను చేపట్టింది. 2004 నుంచి ఈ కాలువ నిర్మాణానికి మొత్తం రూ. 4,038 కోట్లు వెచ్చించగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే రూ. 1,710.08 కోట్లను ఖర్చు చేసి పనులు వేగవంతం చేసింది. కొండలు, కోనలు, రహదారులు మరియు రైల్వే ట్రాక్‌ల వంటి కఠినమైన భౌగోళిక సవాళ్లను అధిగమించి నీటిని మళ్లించడంలో ఇంజినీరింగ్ నైపుణ్యం, కార్మికుల కృషి కీలక పాత్ర పోషించాయి.

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట వద్ద ప్రారంభమయ్యే ఈ ఎడమ కాలువ విశాఖపట్నం వరకు 213.409 కిలోమీటర్ల పొడవున ఉంది. ప్రధాన డ్యామ్ పూర్తికాకపోయినప్పటికీ, గతంలో నిర్మించిన పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి వరద నీటిని ఎడమ కాలువలోకి తరలిస్తున్నారు. గోదావరికి వరద ఉన్న సమయంలో పుష్కర పథకం నుంచి 1,400 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. అందులో కొంత భాగాన్ని ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోంది.

తుని సమీపంలో పోలవరం ఎడమ కాలువ అక్విడెక్టు వద్ద పవిత్ర గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేయడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు. పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉత్తరాంధ్రకు తరలిస్తున్నారు. మొదటి దశలో అనకాపల్లి, విశాఖ దిశగా మళ్లించడం ద్వారా దశాబ్దాల నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా తొలిదశలోనే అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపడంతో పాటు 1.48 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందిస్తారు. ఏలేరు ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తంగా 2.87 లక్షల ఎకరాలకు నీటి భరోసా లభిస్తుండగా, 143 గ్రామాల్లోని 4.23 లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది. భవిష్యత్తులో ఈ నీటిని విశాఖలోని మేఘాద్రిగెడ్డ, అక్కడి నుంచి విజయనగరం జిల్లా గడిగెడ్డ వరకు మళ్లించడం ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించినట్లే.
Frequently Asked Questions
అనకాపల్లి జిల్లాకు గోదావరి నీటిని ఎలా విడుదల చేశారు?
పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయం నిర్మాణం ఎప్పటిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందే ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తున్నారు.
పోలవరం ఎడమ కాలువ పొడవు ఎంత, అది ఎక్కడ ప్రారంభమవుతుంది?
పోలవరం ఎడమ కాలువ 213.409 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట వద్ద ప్రారంభమై విశాఖపట్నం వరకు విస్తరించి ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా తొలిదశలో అనకాపల్లి జిల్లాకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
తొలిదశలో అనకాపల్లి జిల్లాలోని 110 చెరువులను నింపడంతో పాటు 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 143 గ్రామాల్లోని 4.23 లక్షల మందికి తాగునీటి సమస్య తీరుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















