ONGC Gas Blowout:డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మలికీపురం మండలంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఓఎన్జీసీ డ్రిల్‌ సైట్‌ నుంచి భారీగా సహజ వాయువు లీక్ కావడంతోపాటు, మంటలు చెలరేగడం స్థానికుల్లో ఆందోళన కలిగింది. మలికీపురం మండలంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న మోరీ-5 అనే ప్రత్యేక ఆయిల్‌ వెల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, ఓన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Continues below advertisement

మోరీ-5 బావిలో అసలేం జరిగింది?

మలికీపురం మండలంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జీసీ డ్రిల్‌ సైట్‌లో సహజవాయువు లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఇది మోరీ-5 అనే ప్రత్యేక బావికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా జరిగింది. ఈ బావిలో ఉన్న సహజవాయువు నిల్వలను అంచనా వేస్తున్న సమయంలో ఈ లీకేజీ జరిగి , మంటలు చెలరేగాయి. ఓఎన్జీసీ నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ బావిలో సుమారు 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల సహజ వాయువు నిల్వలు ఉండొచ్చని తెలుస్తోంది. 

ఈ ఘటనపై నెలకున్న అతి పెద్ద సందిగ్ధతను జిల్లా కలెక్టర్‌ క్లియర్ చేశారు. ఈ మోరీ-5 బావికి గెయిల్ పైప్‌ లైన్‌తో ఎలాంటి సంబంధం లేదని ఇది పూర్తిగా స్వతంత్రంగా జరిగిన ఘటన అని కలెక్టర్‌ మహేష్‌ కుమార్ స్పష్టం చేశారు. 

Continues below advertisement

యుద్ధప్రాతిపదికన అగ్నిమాపక చర్యలు 

మంటలు చెలరేగిన అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే మంటలు పూర్తిగా ఎప్పుడు అదుపులోకి వస్తాయనే దానిపై స్పష్టత రావడానికి కనీసం 24గంటలు సమయం పడుతుందని కలెక్టర్‌ మహేష్‌ కుమార్ వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా ఓఎన్‌జీసీకి చెందిన ప్రత్యేక ఫైర్‌ ఫైటింగ్‌ విభాగం కూడా రంగంలోకి దిగింది. 

భద్రతా చర్యలు: పాఠశాలల ఊళ్లు ఖాళీ

ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైన నివారణ చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా పరిసర గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులను ఇంటికి పంపేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని  తీసుకున్న ఈ నిర్ణయం  తీసుకున్నారు. ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఈ ఘటనా స్థలానికి 600 మీటర్లు దూరం వరకు ఎటువంటి నివాస ప్రాంతాలు లేవు. దీని వల్ల జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు తక్షణ ముప్పు లేకపోయినప్పటికీ, అధికారులు, స్థానికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. గ్యాస్‌ లీక్ ఘటనలు సహజంగానే ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నారు. 

అంతర్జాతీయ నిపుణులు సలహాలు- ఓఎన్‌జీసీ కీలక ప్రకటన 

ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఓఎన్‌జీసీ కేవలం స్థానిక వనరులపైనే కాకుండా, అంతర్జాతీయ నిపుణుల సంప్రదింపులను కూడా ప్రారంభించింది. గ్యాస్ లీక్, మంటలను అరికట్టేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక సలహాలను వారు తీసుకుంటున్నారు. ఓఎన్‌జీసీ విడుదల చేసిన అధికారిక లేఖ ప్రకారం, సంస్థకు చెందిన సీనియర్‌ నిపుణులు స్వయంగా ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఓఎన్‌జీసీ సీనియర్‌ టీమ్‌ ఆన్‌సైట్‌లో ఉండి, మంటలను ఆర్పే ప్రక్రియను సమన్వయం చేస్తోంది. సాంకేతికంగా ఈ లీకేజీని ఎలా అరికట్టాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై వారు దృష్టి సారించారు. 

ప్రాణం నష్టం లేదు- ఒక సానుకూల అంశం

ఇంతటి భారీ ప్రమాదం జరిగినప్పటికీ వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఎవరూ గాయపడకపోవడం అత్యంత సానుకూలమైన అంశం. కలెక్టర్ మహేష్‌ కుమార్, ఓఎన్జీసీ వర్గాలు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాయి. సమయానుకూలంగా స్పందించడం, మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జగడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. 

అధికారుల సమన్వయం 

జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ఓఎన్‌జీసీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం తరఫున అందిస్తున్నారు. రెవెన్యూ పోలీస్‌ అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, అయితే అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు. 

రాబోయే 24 గంటలు ఈ ఆపరేషన్‌లో అత్యంత కీలకం. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత బావి వద్ద సాధారణ స్థితి పునరుద్ధరించనున్నారు. కోనసీమ జిల్లాలో సహజవాయువు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నందున, ఇటువంటి డ్రిల్లింగ్ సైట్ల వద్ద భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది. 

కోనసీమ గ్యాస్‌ లీక్ ఘటన ప్రస్తుతం అధికారుల అదుపులోనే ఉంది. అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణ, స్థానిక యంత్రాంగం అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదు. మంటలు పూర్తి ఆరిపోయే వరకు రెస్క్యూటీమ్స్‌ అక్కడే నిఘా ఉంచనున్నాయి.