Konaseema District News Today: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసులను పోలీసులు ఛేదించి అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. అయినా ఇంకా కొన్ని కేసులు తలనొప్పిని తీసుకువస్తున్నాయి. హిందూ దేవాలయాలే టార్గెట్‌గా చెలరేగిపోయిన దొంగల ముఠా ఇప్పుడు రాత్రి వేళల్లో తాళం వేసిన దుకాణాలను టార్గెట్ చేస్తున్నారు. గడ్డపారలతో వెనుక డోర్లు పెకిలించి షాపుల్లో విలువైన వస్తువులు ఎత్తుకెళుతున్నారు.
కోనసీమ జిల్లాలో చమురు దొంగతనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు పోలీసులు. ఆక్వారంగంలో కీలకంగా ఉపయోగించుకునే విద్యుత్తు మోటార్లు ఎత్తుకెళ్తున్న ముఠాలు ఎక్కువయ్యాయి. ఇలా మొత్తం మీద అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుస దొంగతనాలు మాత్రం ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి.
హిందూ దేవలయాలే టార్గెట్‌గా...
జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో హిందూ దేవాలయాల్లో చోరీలు చోటుచేసుకున్నాయి. కార్తీకమాసంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేవిధంగా పూజలు, అభిషేకాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆలయాల్లోని విగ్రహాలకు ఆభరణాలు అలంకరిస్తున్నారు. దీంతో దొంగల కన్ను ఆలయాలపై పడింది. కొంచెం జనావాసాలకు దూరంగా ఉండే ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. గుడిలోకి చొరబడి హుండీలు లేపేస్తున్నారు. విగ్రహాలకు అలంకరించిన బంగారు ఆభరణాలు, వెండి ఉపకరణాలను ఎత్తుకెళ్తున్నారు.
భక్తుల తాకిడీ ఎక్కువవడంతో హుండీల్లో భారీగా నగదు దొరుకుతుందన్న ఆలోచనతో హిందూ దేవాలయాలను ఇలా టార్గెట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాలు కొట్టేశారు కేటుగాళ్లు. వారిని పోలీసులు అరెస్టు చేారు. ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు.
షాపుల తలుపులు పగులకొట్టి మరీ...
ఈ మధ్యకాలంలో కమర్షియల్ షాపుల దొంతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఏదైనా దుకాణానికి వెనుక డోర్ ఉండి.. నిర్మానుష్యమైన ప్రాంతమైతే చాలు కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్యనే అల్లవరం మండల పరిధిలో పలు దుకాణాల వెనుక డోర్‌లు ధ్వంసం చేసి షాపుల్లో ఉన్న విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్లారు. ఓ ఫోటో స్టూడియోలోకి చొరబడ్డ దొంగలు విలువైన కెమెరాలు, హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకెళ్లారు.
ఈ విషయాలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.3లక్షలు విలువైన కెమెరాలు ఎత్తుకెళ్లినా రూ.2లక్షల లోపు అని రాసుకెళ్లారని దుకాణదారు వాపోతున్నారు. క్లూస్‌టీమ్‌ను రప్పించకుండా కేవలం కానిస్టేబుళ్ల స్థాయి వాళ్లే ఫీల్డ్‌లోకి వచ్చి తూతూ మంత్రంగా కేసు దర్యాప్తు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి..
ఆక్వాచెరువుల వద్ద మోటార్లును వదలడం లేదు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వాసాగు ఎక్కువగా ఉంటుంది.. 90 శాతం ఆక్వాచెరువులు విద్యుత్తు వినియోగంపైనే ఆధారపడి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది నీటి అవసరాల కోసం విద్యుత్తు మీటర్లును వినియోగిస్తుంటారు. రాత్రివేళల్లో దొంగలు చొరబడి విద్యుత్తు మోటార్లును ఎత్తుకెళ్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక్కో మోటారు విలువ రూ.లక్ష నుంచి రూ.3 లక్షలపైబడే ఉంటుందని. ఏరియేటర్లు, విలువైన సామాగ్రి కూడా వదలడం లేదని ఆక్వారైతులు లబోదిబోమంటున్నారు.
ఓఎన్జీసీ వెల్స్ నుంచి ఆయిల్ చోరీ..
చమురు, సహజవాయు నిక్షేపాలకు సంబంధించి ఉత్పత్తిలోకి వచ్చిన వెల్స్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ. ఆన్‌షోర్‌లోఉత్పత్తిలోకి వచ్చిన వెల్స్ నుంచి ఆయిల్‌ను దొంగతనం చేస్తున్న ముఠాను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెల్స్ నుంచి దొంగిలించిన ఆయిల్‌ను లీటరు రూ.50కు కొనుగోలు చేసి రూ.80కు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్‌చేశారు. ఈ దొంగతనానికి పాల్పడిన గూడాల రమేష్, జోగి ధనరాజు, పంజా నూకరాజును అరెస్ట్ చేశారు. ఓఎన్జీసీ వెల్‌కు పైపు బిగించి దాని నుంచి ఆయిల్ దొంగతనం చేసేవారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయిల్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద శబ్ధం రావడంతో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పలుచోట్ల పార్కింగ్ చేసిన బైక్‌లు కూడా ఇటీవల కాలంలో చోరీకి గురి అవుతున్నాయి. దీంతో పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతోన్న వరుస దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నాకు భయమా! పోలీసు నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల