Minister Venu Gopala Krishna : చంద్రబాబు నేను గెలవలేనని, అందరూ కలిసిరండని అన్ని పార్టీల వద్దకు వెళ్లి ప్రాధేయపడుతున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ విమర్శించారు. రాజమండ్రిలో మాట్లాడిన ఆయన...పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి చంద్రబాబు ప్రాధేయపడుతున్నారన్నారు. పేదలందరికీ సంక్షేమం జరుగుతుంటే సంక్షేమం దండగ అంటూ చంద్రబాబు తప్పుడు రాతలు రాయిస్తున్నారన్నారు. సంక్షేమం దండగన్న నోటితోనే ఇప్పుడు ప్లేటు ఫిరాయించి సంక్షేమాన్ని తాను కొనసాగిస్తానంటున్నారన్నారు. మీ పరిపాలనలో ఉచిత విద్యుత్ దండగ అన్నారు, ఆరోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇస్తుంటే చంద్రబాబు విమర్శలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ సంక్షేమాన్ని దండగా అని మాట మార్చి తాను సంక్షేమాన్ని కొనసాగిస్తానని కొంగ జపం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబును బాదుడే బాదుడు
"చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి. ప్రజా క్షేమం కాదు. చంద్రబాబు ప్రజాక్షేమాన్ని కాంక్షించలేడు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తున్న బడుగులను మళ్లీ బాధల్లోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నీ బాదుడే బాదుడు భరించలేక 2019లో నిన్ను ఒక్క బాదుడే బాదారు. ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు వేస్తున్న మారు వేషం ఇక ప్రజలు నమ్మరు. ఈ మారు వేషాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి. నువ్వు రాయిస్తున్న రాతలు మానుకో చంద్రబాబు. " - మంత్రి చెల్లుబోయిన వేణు
సకాలంలో సాగు నీరు
రైతులకు సకాలంలో సాగు నీరందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి హోం మంత్రి తానేటి వనిత, సమాచార శాఖ మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు సకాలంలో పూర్తి స్థాయిలో అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 30న సాగునీరు అందిస్తున్నామని మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు తెలిపారు. సకాలంలో సాగు నీరందివ్వడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. అదేవిధంగా లిప్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇబ్బందులు ఉంటే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రబీ సాగు ముందస్తుగా సాగునీరు అందివ్వడం వల్ల పంట కాలం ముందుకు వెళ్లి రైతులు ప్రకృతి వైఫరీత్యాల నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుందన్నారు. గత ఏడాది ముందస్తుగా సాగునీరు ఇవ్వడం వల్లనే ఈ ఏడాది ఖరీప్ పంట ముందస్తుగా కోతల దశకు చేరుకుందని తెలిపారు.
బీసీలకు ఆత్మగౌరవం
బీసీలను ఆత్మగౌరవంతో బతికేలా వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయా సామాజికవర్గాల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యావకాశాలు లేక వెనుకబడిన బీసీలకు జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.