Vundavalli Aruna Kumar : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అనర్హత వేటుపై మోదీ ప్రభుత్వానిది తొందరపాటు చర్యని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత వ్యవహారంలో రాహుల్ గాంధీకి కచ్చితంగా సానుభూతి లభిస్తుందన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన మోదీ దేశంలో మార్పు తెస్తారని అనుకున్నానన్నారు. ప్రధాని మోదీ వింత పోకడలకు వెళ్తున్నారన్నారు.
అదానీ వ్యవహారం పక్కదోవ పట్టించేందుకే
"సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ చేశారు. పరువు నష్టంలో రెండు రకాలు. క్రిమినల్ పరువు నష్టం అయితే జైలు శిక్ష వేస్తారు. సివిల్ పరువు నష్టం అయితే ఇంత డబ్బు కట్టమని చెబుతారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసు సెషన్స్ లో అసలు నిలబడదు. ఎందుకు ఆ పిటిషన్ వేసిన వ్యక్తిని తిట్టే ఉద్దేశం రాహుల్ గాంధీకి లేదు. అలాంటి కేసులో కోర్టు జైలు శిక్ష వేయడం, పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం, వెంటనే ఇళ్లు ఖాళీ చేసేమనడం... కనీసం పద్దతులు కూడా పాటించలేదు. అదానీ కోసం గొడవ చేస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి అని మోదీ సంకేతాలు ఇచ్చారు. రాహుల్ గాంధీనే విడిచిపెట్టలేదు అనే విధంగా మిగతా ఎంపీలకు హెచ్చరికలు ఇచ్చారు."- ఉండవల్లి అరుణ్ కుమార్
డిగ్రీలుంటే చూపించడానికి ఏమైంది
"ఇదే టైంలో కేజ్రీవాల్ ఏంఅడిగారు ప్రధాని మోదీ నిజంగా పాస్ అయ్యారా? ఆర్టీఐ వేశారు. ప్రధాని మంత్రి ఆఫీస్ ఈ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ చెప్పాలి, లేదంటే గుజరాత్ యూనివర్సిటీ వాళ్లు ఇవ్వాలని చెప్పాలి. కానీ ఇవేం చేయకుండా కేజ్రీవాల్ కు తిరిగి రూ.25 వేల ఫైన్ వేయడం ఏంటి? ప్రధాని మోదీ ఇచ్చిన విద్యార్హతపై ఇచ్చిన డిక్లరేషన్ ను ఉంటే చూపించండి అని పిటిషన్ వేస్తే ఫైన్ వేశారు. ఈ రెండు కేసులపై పూర్తి చర్చ జరగాలి. ప్రజాస్వామ్యం పీక నొక్కేయాలని చూస్తున్నారు. విదేశాలు కూడా అందుకే భారత్ ను మేము అబ్జర్వ్ చేస్తున్నాం అంటున్నాయి. భారత్ లో ఇలాంటి పరిస్థితులు మారాలి. ప్రధాని మోదీ రెక్టిఫై చేసుకోవాలి. ప్రధాని మోదీ ఆ డిగ్రీలు చదువుకోకపోతే చెప్పాలి. మీ డిగ్రీల బట్టి మీరు ప్రధాని అవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి ఎలెక్షన్ డిక్లరేషన్ లో 20 ఎకరాలు చూపించలేదు. టీడీపీ వాళ్లు కోర్టుకెళ్లారు. ఆ 20 ఎకరాలు మా అమ్మాయి ఇచ్చాననుకున్నాను... ఇవ్వలేదన్నారు. నేను ఉద్దేశపూర్వకం చేయాలనుకోలేదు. మోదీని పల్లెత్తు మాట అంటే చాలు ఏమైనా చేయాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ అంటే సామాన్యుడు కాదు. రాజీవ్ గాంధీ కుమారుడు, ఇందిరాగాంధీ మనవడు. వారి కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించింది. వేల కోట్లు దేశం కోసం ఇచ్చేశారు. అలాంటి వ్యక్తికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయించారు. మోదీ మెప్పుకోసం కొందరు ఇలా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా సానుభూతి క్రియేట్ అవుతుంది. " - ఉండవల్లి అరుణ్ కుమార్