Rains in Andhra Pradesh | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరములో ఏర్పడిన వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగముతో తూర్పు ఈశాన్యముగా కదులుతోంది. అది 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశము, చెన్నైకి (తమిళనాడు) తూర్పు ఈశాన్యంగా 480 కి.మీ. దూరములో, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయముగా 430 కి.మీ దూరములో, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ దిశలో 590 కి.మీ దూరములో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం క్రమంగా తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ, దాని తీవ్రత మరికొన్ని గంటలపాటు కొనసాగిన తర్వాత సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం బలహీనపడనున్న సమయంలో ఏపీ, తమిళనాడు, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం ఈ జిల్లాల్లో వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆయన ఆదేశించారు. శనివారం నాడు వర్షాలు కురిసిన జిల్లాలల్లో ఆదివారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వీటితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో పొడి వాతావరణం, తగ్గిన చలి
తెలంగాణలో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల్లో 3, 4 డిగ్రీల మేర మారనున్నాయి. మొన్నటి వరకు సింగిల్ డిజిట్ నమోదు అయిన ఆదిలాబాద్ లోనూ డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు మరో రెండు రోజులు చలి నుంచి కాస్త ఊరట లభించనుంది.

నెం ఏరియా గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత
1 ఆదిలాబాద్ 31.3 13.2
2 భద్రాచలం  31.4  21.5
3 హకీంపేట్  29.7 19.1
4 దుండిగల్   30.9 19.9
5 హన్మకొండ 32 21.5
6 హైదరాబాద్   30.5 20.8
7 ఖమ్మం  32 21.6
8 మహబూబ్ నగర్  30.4 22
9 మెదక్   31.6 16.8
10 నల్గొండ   28.5 18.4
11 నిజామాబాద్  33.6 20.4
12 రామగుండం  32.2 20.4
13 హయత్ నగర్ 30 19

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగమంచు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. నగరంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 21 డిగ్రీల మేర నమోదు కానున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటలకు 2 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.

Also Read: Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి