Putala Pattu YCP MLA MS Babu has joined Congress : ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శనివారం ఉదయం వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎంఎస్ బాబుకు టిక్కెట్ నిరాకరించారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా టిక్కెట్ దక్కని సునీల్ కుమార్ కు చాన్సిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను అయిన తనను కాదని.. మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఇవాళ షర్మిల హామీ మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనే పూతలపట్టు నుంచి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది.
ఎంఎస్ బాబు ఇటీవల తనకు టిక్కెట్ రాదని తెలిసిన తర్వాత సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు. జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని అన్నారు. ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదనిఅసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుపత్తి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని ఆయన ఫైర్ అయ్యారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. అయితే తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. దళితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఎం.ఎస్ బాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించారు. గత ఎన్నికల్లో ఆయనే టిక్కెట్ ఇప్పించారు. అయితే ఇప్పుడు టిక్కెట్ ఇవ్వడం లేదని నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలు చేయడంతో పెద్దిరెడ్డి కూడా ఆగ్రహించారు. ఈ కారణంగా ఆయనకు పార్టీలో కనీస ప్రాధాన్యత లేకుండా పోయింది. చివరికి కాంగ్రెస్‌లో చేరి.. పోటీ చేస్తున్నారు.