Daggubati Purandeshwari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకూ ఈమె బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. అంతేకాక, ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. సోము వీర్రాజును రాజీనామా చేయించిన అనంతరం అధ్యక్ష పదవి కోసం సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించాయి. కానీ అధిష్ఠానం పురంధేశ్వరి వైపే మొగ్గు చూపింది.


2014లో బీజేపీలో చేరిక


దగ్గుబాటి పురందేశ్వరి తొలుత కాంగ్రెస్ పార్టీతో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఈమె 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖపట్నం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి గానూ పురంధేశ్వరికి అవకాశం దక్కింది. ఏపీ పునర్విభజనకు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలపడంతో ఆమె పార్టీ తీరును వ్యతిరేకించారు. విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత 2014లో పురందేశ్వరి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా ఆమెకు అధిష్ఠానం బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం బీజేపీకి ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.


తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి


తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో కీలక మార్పులు చేయాలని హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిపి చివరికి బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత. 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రస్థానంప్రారంభించారు.  1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నంచి ఆ పార్టీలో పని చేస్తున్నారు.  1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు.   1985లో  ఉమ్మడి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు అయ్యారు.  యువమోర్చాలో అనేక పదవులు నిర్వహించారు.  2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవులను నిర్వహించారు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.


కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు.  2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  2014 ఎన్నికలలో మూడో సారిగెలిచారు.  2014 లో మరల తెలంగాణ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టారు.  కిషన్ రెడ్డి 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆరెస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైనా  2019 లో జరిగిన పార్లమెంట్ ఎలెక్షన్లలో సికింద్రాబాద్ నుండి గెలిచి  క్యాబినెట్ మంత్రి అయ్యారు.