CM Jagan : వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో సీఎం జగన్ పర్యటించారు. కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణను ప్రారంభించారు. పులివెందులలో కూరగాయల మార్కెట్, బస్టాండ్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. పులివెందులలో బస్ స్టాండ్ కూడా కట్టని సీఎం మూడు రాజధానులు కడతారంట అని చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ చెక్ పెట్టినట్లే కనిపిస్తుంది. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదన్నారు. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే అప్పుల పెరుగుదల తక్కువగానే ఉందని తెలిపారు. గతంలో ఇదే బడ్జెట్ ఉందని ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయన్నారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
అప్పుడూ ఇదే బడ్జెట్
"నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. పులి వెందులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాం. అత్యాధునిక వసతులతో వైఎస్సార్ బస్ స్టాండ్ ప్రారంభించాం. రాష్ట్రంలోని బస్ టెర్మినల్‌కు పులివెందుల బస్ టెర్మినల్ ఆదర్శంగా నిలుస్తుంది. చంద్రబాబు తీరు ఒక గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా అసలు గ్లాసులో నీళ్లు లేవనే ప్రచారం చేయిస్తున్నారు. గతంలో ఉన్న బడ్జెట్.. ఇప్పుడూ ఉంది. గత ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది?. ప్రతిపక్షాలు కావాలనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువే " - సీఎం జగన్
వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు చేశారు. పులివెందులలో విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, నూతన కూరగాయల మార్కెట్‌ను, మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించారు. రాయలాపురం నూతన బ్రిడ్జి, వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి మాట్లాడారు సీఎం జగన్. అనంతరం అహోబిలాపురంలో స్కూలును ప్రారంభించారు.