NTR Vaidyaseva Treatments: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ  (NTR Vaidya Seva) పథకాన్ని మళ్లీ ప్రైవేటు ఆస్పత్రులు కొనసాగిస్తున్నాయి.  ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఫలితాలు ఇచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్‌తో జరిగిన  చర్చల తర్వాత, స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమించాలని నిర్ణయించింది. వైద్య సేవా పథకం కింద అన్ని సేవలనూ తక్షణమే పునఃప్రారంభించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.  శుక్రవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో జరిగిన చర్చల్లో ప్రభుత్వం రూ.250 కోట్ల బకాయిల చెల్లింపుకు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Continues below advertisement

రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద పనిచేస్తున్న స్పెషాలిటీ ఆసుపత్రులు గత కొన్ని నెలలుగా బకాయిల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సమ్మె చేపట్టింది.ఇరవై రోజుల నుంచి సమ్మె జరుగుతోంది.  ఈ రోజు సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. ప్రభుత్వం వెంటనే రూ.250 కోట్ల బకాయిల చెల్లింపుకు అంగీకారం తెలపడంతో అసోసియేషన్ సమ్మె విరమించడానికి ముందుకు వచ్చింది. 

చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ముఖ్యమైనవి. నవంబర్ 15, 2025లోపు రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాకుండా, అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధానం ద్వారా అసోసియేషన్‌కు ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. 

Continues below advertisement

ప్రభుత్వం  యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (UHS) తీసుకు రావాలనుకుంటోంది. ఈ స్కీం రూపకల్పన, అమలు విషయంలో  ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌తో కలిసి పనిచేయాలని  ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి.  ఈ క్రమంలో ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ చర్చలు, నిర్ణయాలకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు చొరవ చూపారని  అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ట్రస్ట్ వైస్ చైర్మన్ సుధాకర్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, వైద్య సేవ ట్రస్ట్ సీఈవోలకు కూడా ధన్యవాదాలు చెప్పారు.  ఈ సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు (NTR Vaidya Seva) పునరుద్ధరించారు.    పేదలు, మధ్యతరగతి ప్రజలకు స్పెషాలిటీ చికిత్సలు ఉచితంగా అందనున్నాయి.   

గత ప్రభుత్వం పెట్టిన రెండున్నర వేల కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చాక మరో ఐదు వందల కోట్ల బకాయిలతో ప్రైవేటు ఆస్పత్రులకు రూ. మూడు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉందని చెప్పి  ఆస్పత్రుల యాజమాన్యాలు  సమ్మెకు దిగాయి. మొదట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. చర్చలు జరపలేదు. చివరికి ఆస్పత్రి యాజమాన్యాలు .. ధర్నా కూడా చేశాయి. అయినా పట్టించుకోలేదు. చివరికి  ఆస్ప్తరి యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చిన హామీతో సంతృప్తి చెంది.. సమ్మె విరమించాయి.త