Prashanth Kishore Comments on AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ సీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఫలితం ఉండబోదని అన్నారు. ఆయన నమ్మకం వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటివారు కూడా చెబుతున్నారని.. వారి పార్టీలు ఎన్నికల్లో గెలవబోవని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్‌కు ఢిల్లీలో ఆదివారం (మే 19) ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఈ ఎన్నికల ఫలితాల్లో నా అంచనాలు తప్పయితే నా ముఖంపై పేడ పడుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాతో సవాలు చేసిన అమిత్ షా ముఖంపై పేడ పడింది. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. నేను చెప్పింది నిజమైతే జగన్ మోహన్ రెడ్డి ముఖంపై పేడ పడుతుంది.. లేదంటే నాపై పడుతుంది’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.


ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరని పీకే తెలిపారు. తాను పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్నానని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత వరకు కూడా రాజకీయ నాయకులు ఓటమిని అంగీకరించబోరని చెప్పారు. రాబోయే రౌండ్లలో తమకే మెజారిటీ వస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తుంటారని చెప్పారు. అటు  చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్నారని.. అయితే, జగన్‌ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 


మరోవైపు, దేశవ్యాప్త ఎన్నికల పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉందని.. అంతేకానీ, ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాబట్టి, బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.