Police arrest MLC Ananthababu at Rajahmundry court: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ..సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా పరారీలో ఉన్న ఆయనను పోలీసులు రాజమండ్రి కోర్టు సమీపంలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ హత్య కేసులో బెయిల్‌పై ఉన్న ఆయన, తనపై ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడానికి సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని.. సాక్షులు స్వయంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. కేసును నీరుగార్చే ఉద్దేశంతో సాక్షులను బెదిరించడమే కాకుండా, వారికి భారీగా నగదు ఆశ చూపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆయనపై అదనంగా మరో క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ప్రక్రియలో పోలీసు శాఖలోని అంతర్గత కుమ్మక్కులు బయటపడటం కలకలం రేపింది. సాక్షులను బెదిరించిన వ్యవహారంలో మూడు రోజుల క్రితమే పోలీసులు ఆయనను పట్టుకోవాల్సి ఉండగా, అప్పటి విచారణాధికారి అనంతబాబుకు ముందస్తు సమాచారం చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడికి సహకరిస్తూ పోలీసుల కళ్లు గప్పి ఆయన పరారీ కావడానికి సదరు అధికారి పరోక్షంగా తోడ్పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. ఈ డబుల్ గేమ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు, ఆ అధికారిని తక్షణమే విధులనుంచి తొలగించి వీఆర్ కు పంపారు. కేసు దర్యాప్తు బాధ్యతలను కొత్త అధికారికి అప్పగించిన వెంటనే పోలీసుల వ్యూహం పూర్తిగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, నిఘా వర్గాల సహకారంతో అనంతబాబు కదలికలను నిశితంగా గమనించారు. ఆయన రాజమండ్రి కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కోర్టు పరిసరాల్లో మఫ్టీలో ఉన్న పోలీసులు, అనంతబాబు అక్కడకు చేరుకోగానే ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పరారీకి తెర దించుతూ ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతబాబు ఈ కేసులోని నలుగురు కీలక సాక్షులకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఇచ్చేందుకు బేరసారాలు సాగించినట్లు ఆధారాలు లభించాయి. డబ్బుతో లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సాక్షులను భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. హత్య కేసులో తన మెడకు ఉచ్చు బిగుస్తుండటంతో, సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు రివర్స్ అయ్యింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీని విచారించి, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో వైపు ఈ కేసును కొట్టి వేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పిటిషన్ దాఖలు చేశారు.
MLC Ananthababu arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ - రాజమండ్రి కోర్టు వద్ద మాటేసి పట్టుకున్న పోలీసులు
Raja Sekhar Allu | 24 Apr 2026 02:44 PM (IST)
Police arrest MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు రాజమండ్రి కోర్టు సమీపంలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసిన కేసులో ఆయన పరారీలో ఉన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ - రాజమండ్రి కోర్టు వద్ద మాటేసి పట్టుకున్న పోలీసులు