Polavaram Project : భారీ వరదల కారణంగా పోలవరం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటికే 43 మీటర్ల ఎత్తు, 2.5 కి.మీ పొడవున ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా మరో మీటరు ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. జులై15న ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచే పనులు ప్రారంభం అయ్యాయి. రెండ్రోజుల్లోనే జులై 17 నాటికి 1 మీ ఎత్తు పెంచే పనులు పూర్తి చేశారు. 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేసి ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచినట్లు డ్యామ్ నిర్మాణ సంస్థ తెలిపింది. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు చేరింది. భారీ వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 


ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంపు నిర్ణయం 


గోదావరికి భారీ వరద పోటెత్తడంతో ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం 2.5 కి.మీ పొడవునా ఒక మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచే పనులు జులై 15న ప్రారంభమయ్యాయి. జులై 17 నాటికి ఈ పనులని పూర్తి చేశారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. దీనికి మించి వరద నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాంపై నుంచి నీరు దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలోపెట్టుకొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎగువ కాఫర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేపట్టారు. 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేసి ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్లకు పెంచామని నిర్మాణ సంస్థ తెలిపింది. 


వరదల దృష్ట్యా


గోదావరికి 1986లో అత్యంత భారీ వరద వచ్చింది. అప్పట్లో 75.6 అడుగుల స్థాయికి భద్రాచలం వద్ద వరద వచ్చింది. అదే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం ఉన్న ప్రవాహాలు ఆధారంగా రెండో అతి పెద్ద వరదగా పరిగణించే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టుకు 26 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరకు ఎంతైనా వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం పరిస్థితిపై, ఎగువ కాఫర్ డ్యామ్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం జల వనరులశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచే ప్రతిపాదనకు సీఎం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు.