Minister Ambati Rambabu : ఏలూరు జిల్లా పోలవరంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటిస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టును పనులను పరిశీలించారు. గురువారం రాత్రే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేసి.. ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులను పరిశీలిస్తున్నారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఆయా పనుల పురోగతిని ఇంజినీర్లు మంత్రికి వివరించారు. స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. మధ్యాహ్నం తర్వాత ఇంజినీర్లు, ఇతర అధికారులతో అంబటి సమీక్ష నిర్వహిస్తారు. గత ప్రభుత్వం తొందరపాటు పనులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అందువల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు.  యుద్ధ ప్రాతిపదికన కాఫర్‌ డ్యాం ఎత్తును పెంచామని తెలిపారు.  గత ప్రభుత్వం కాఫర్‌ డ్యాం పనులను గాలికొదిలేసిందన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయిన రాష్ట్ర నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 







అందుకే ఆలస్యం 


 పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు పనికిరాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని  మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిపుణుల రిపోర్టు అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతదే కొనసాగించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాఫర్ డ్యామ్  పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని ఆరోపించారు. 41.17 కాంటూరు పరిధి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సింది ఉందన్నారు. ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించడంలేదన్నారు.  


అప్పర్ భద్ర విషయంలో ఆందోళన వద్దు



తాను మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు పూర్తి చేయాలనే తొందరపాటు తనకు లేదని మంత్రి అంబటి అన్నారు. పోలవరం నిర్మాణంలో తొందరపడితే అనేక సమస్యలు వస్తాయన్నారు.  అప్పర్ భద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంలో రాయలసీమ ప్రజలు ఏ మాత్రం కంగారుపడాల్సిన అవసంలేదన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉపనదులు తుంగ, భద్ర నుంచి 42 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించింది.  దీంతో  రాయలసీమకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఏపీ వాదన. నదీ జలాల కేటాయింపులో కృష్ణా వాటర్ బోర్డు, బచావత్ కమిషన్ ఏం చెప్పిందో అదే విధంగా  కేటాయింపులు ఉండాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  


పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన 


అలాగే  పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు. ఇందుకోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు.  గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయిందని ఆయన తెలిపారు.