Godavari Water Disputes Tribunal Award: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం–బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల అంచనాల కమిటీ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పర్యావరణ అనుమతుల  ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. గోదావరి నది నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలించేలా రూ. 81,900 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే నిలిచిపోవడం రాష్ట్ర జలవనరుల శాఖకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది. 

Continues below advertisement

చట్టపరమైన చిక్కులతో తిరస్కరణ         

ఈ ప్రతిపాదనను తిరస్కరించడానికి ప్రధానంగా అంతర్రాష్ట్ర వివాదాలు, చట్టపరమైన చిక్కులే కారణమని ఈఏసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు డిజైన్ 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంది. గోదావరి వరద జలాల మళ్లింపు వల్ల ఎగువన ఉన్న తెలంగాణతో పాటు, ముంపు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రయోజన దెబ్బతింటాయన్న అభ్యంతరాలు వచ్చాయి. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై ముందుగా సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది.           

Continues below advertisement

శాస్త్రీయంగా అధ్యయనానికి సూచన           

వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం  ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. గోదావరి బేసిన్‌లో అసలు మిగులు జలాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయో సవివరమైన నివేదిక రూపొందించాలని పేర్కొంది. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాలతో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలను సంప్రదింపుల ద్వారా లేదా చట్టబద్ధ వేదికలపై పరిష్కరించుకున్న తర్వాతే, పర్యావరణ అనుమతుల కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.      

సముద్రంలో కలసిపోతున్న నీటిని వాడుకుంటామన్న ఏపీ         

 సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి వరద నీటిలో దాదాపు 200 టీఎంసీలను రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల కరవు ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా దాదాపు 80 లక్షల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు లభించడమే కాకుండా, 3 లక్షల హెక్టార్ల  దాదాపు 7.41 లక్షల ఎకరాలు  కొత్త ఆయకట్టుకు సాగునీరు అందగలదని, మరో 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.       

తాత్కలికంగా బనకచర్లకు బ్రేక్                

కేంద్రం నుంచి వచ్చిన ఈ సాంకేతిక, చట్టపరమైన ప్రతిబంధకంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, సిడబ్ల్యూసితో కలిసి వరద నీటి లభ్యత గణాంకాలను పక్కాగా సిద్ధం చేయడం, అంతర్రాష్ట్ర అభ్యంతరాలకు సంబంధించి న్యాయపరమైన వివరణలు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.