Poasani Krishna Murali in hospital: పోసాని కృష్ణమురళి అనారోగ్యానికి గురయ్యారు. తనకు నలతగా ఉందని చెప్పడంతో పాటు ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో వైద్యులు ఆయనను పరిశీలించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోసానికి గుండె సమస్య ఉండటంతో ఈసీజీ తీశారు. ఈసీజీలో సమస్యలు ఉన్నట్లుగా కనిపించడంతో ఆయనను కడపకు తరలించి చికిత్స అందించే అవకాశాలు ఉన్నాయి.
పోసానికి గుండె సంబంధిత సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు
పోసాని కృష్ణమురళిని రిమాండ్ కు తరలించే ముందు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆయన మెడికల్ రికార్డును కూడా పరిశీలించారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించారు. ఆయన ఉపయోగించే మందులన్నీ ఆయనకు అందుబాటులో ఉంటారు. అియతే తనను అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆయన టెన్షన్ పడుతున్నారు. అరెస్టు చేసేందుకు తన ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులతో ఆయన విపరీతంగా ప్రవర్తించారు. మొదటగా తాను రానన్నారు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి బతిమాలారు. తర్వాత ఆయన బనీన్ , నిక్కర్ మీదనే హడావుడి చేశారు. ఆ దృశ్యాలన్నీ ఆయన ఇంట్లో వాళ్లే రికార్డు చేసి మీడియాకు ఇచ్చారు.
అరెస్టు అయినప్పటి నుంచి టెన్షన్ పడుతున్న పోసాని కృష్ణమురళి
పోలీసులు అరెస్టు చేస్తున్నందున ఆయన తీవ్రంగా టెన్షన్ పడినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు కూడా దాదాపుగా తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. అరెస్టు చేసినప్పటి నుండి ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. పోలీసుల విచారణలో తాను స్వతహాగా అన్న మాటలు కావని.. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి స్క్రిప్ట్ వస్తే మాట్లాడిన మాటలని.. సజ్జల భార్గవరెడ్డి వాటిని వైరల్ చేసేవారని ఆయన చెప్పినట్లుగా పోలీసులు వాంగ్మూలం రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
సజ్జల చెబితేనే అలా తిట్టానని చెప్పినట్లుగా వాంగ్మూలం
పోసాని అనారోగ్యం ఎలాంటిదన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఇంతకు ముందే ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా.. కొత్తగా ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది అవుతుందన్న కారణంగా ఆయనను ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అత్యంత ఘోరంగా మాట్లాడేవారు. రాజకీయ ప్రత్యర్థుల్ని.. వారి కుటుంబాలను, పిల్లలను కూడా వదిలి పెట్టేవారు కాదు. ఈ క్రమంలో ఆయనపై పదిహేడు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో ఆయనను రిమాండ్ కు తరలించారు.