Perni Nani Fires on Chandrababu: ‘చంద్రబాబు కనిగిరిలో రా...కదలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి. ప్రజలు ఎందుకు కదలాలి అనేది సమాధానం చెప్పలేదు. కానీ ప్రకాశం జిల్లా మొత్తం నుంచి జనాన్ని పోగేసి సభ పెట్టాడు. రాజకీయాల్లో పగవానికి కూడా చంద్రబాబు లాంటి దుర్గతి పట్టకూడదు’ అని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 14 ఏళ్ళలో నేను ఈ మంచి చేశాను అని ఒక్క మాట కూడా చంద్రబాబు ఆ సభలో చెప్పలేదు. గంటసేపు మాట్లాడితే.. మొత్తం సీఎం జగన్ ను దూషించడం, తనకు తానే గాలి కొట్టుకోవడం తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం అభ్యర్థి మా నాన్నే అని లోకేశ్ అంటున్నా... పవన్‌కు సిగ్గు లేకపోతే ఏం చేస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కనిగిరి వాళ్లు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు.. హైదరాబాద్, బెంగుళూరు వెళ్లి కోట్లు సంపాదిస్తారు అని చంద్రబాబు చెప్పడాన్ని పేర్ని నాని తప్పుపట్టారు. 2019 వరకూ ఉన్నప్పుడు అప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా? వారికి ఎందుకు ఆ అవకాశాలు కల్పించలేదు? అంతకు ముందు తొమ్మిదేళ్లు కూడా మీరు ఉన్నారు. రేపు అధికారం ఇస్తే కనిగిరి వారికి అవకాశాలు కల్పిస్తాననడం కంటే అరచేతిలో వైకుంఠం చూపిండం తప్ప మరొకటి లేదన్నారు. ఎక్కడ మీటింగ్ జరిగితే ఆ ఊర్లో పుట్టాను.. ఈ ఊర్లో ఆడుకున్నా అని పవన్ కళ్యాణ్ అంటాడంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు. .
వైసీపీ పాలనలో జరుగున్న అభివృద్ధి ఇదీ..
నీ పరిపాలనలో ఒక గ్రామానికైనా గ్రామ పంచాయతీ భవనం ఉందా? కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, నాలుగు పోర్టులు నిర్మాణం, వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవంతుల నిర్మాణం సాగుతున్నాయని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయో కనిపించడం లేదా? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. తన 14 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు రేట్లు ఎప్పుడైనా తగ్గించాడా? ఈయన ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఎవరూ అమెరికా వెళ్లలేదా.. విమానం ఎక్కలేదా.. చంద్రబాబు దారి చూపిస్తే.. ప్రకాశం జిల్లా వాసులు అమెరికా వెళ్లి కోట్లు సంపాదించారన్న చంద్రబాబు మాటలపై మండిపడ్డారు. .
బాబు, పవన్‌లు ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారో చెప్పాలి
ఇంటికో ఉద్యోగం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి 2014లో హామీ ఇచ్చారు. 1.60 కోట్ల కుటుంబాలున్న రాష్ట్రంలో ఎన్ని కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చారో వారిద్దరూ చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలు, 48 వేలకు పైగా వైద్యశాఖలో ఉద్యోగాలు ఇచ్చారు. సుమారుగా 2 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.
హెరిటేజ్, ప్రియా సంస్థల్లో హైదరాబాద్‌లో ఒక రేటు, ఇక్కడో రేటు ఉన్నాయనడం వాస్తం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ షాపుల్లో ఏమైనా తక్కువ రేటుతో అమ్ముతున్నారా? హైదరాబాద్‌లో మీ ప్రియా పచ్చళ్ల రేటెంత..? అప్పడాల రేటెంత? శనగపొడి.. కందిపొడి రేటెంత..? బెజవాడలో ఎంత రేటు..? చంద్రబాబు ప్రజలకు వివరించాలన్నారు. రైతు ఆత్మహత్యలు అని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ వచ్చాక వర్షాలు పడుతున్నాయని, అన్నిచోట్ల వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లా అయినా ఉందా? అని ప్రశ్నించారు.
మందు రేట్లపై చంద్రబాబు పాలిటిక్స్..
జగన్ రేట్లు పెంచాడు అని.. తనకు ఓటేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు తగ్గించేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటరిచ్చారు. ఓటు వేస్తే సరసమైన రేట్లతో ఇంటింటికి మందు సప్లై చేస్తాడట. తాగుబోతులకు ఇది మంచి శుభవార్త అట. ఇది కచ్చితంగా పేదవాడి జీవితాలతో చెలగాటం అన్నారు. మద్యం రేట్లపై హామీ ఇచ్చే రాజకీయ నాయకుడిని ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూశామా? అన్నారు.
బీసీలు కులవృత్తుల్లోనే ఉండి పోవాలా?:
ప్రపంచ వ్యాప్తంగా వెనుకబడిన కులాలు, పేదరికంలో ఉన్న దళితులు దేశవిదేశాలు వెళ్తున్నారంటే నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సంపూర్ణ పీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం వల్లే. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యలు చదువుకుని విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జయహో బీసీ అని పాడతావు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయడు. ఇస్త్రీ పెట్టె ఇచ్చాం.. గొర్రెలిచ్చాం.. ఇవి తప్ప ఇంకోటి ఏమైనా చెప్తున్నాడా? అంటే బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
‘మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు అంటున్నారు. హెరిటేజ్‌లో ఉన్న సామాన్లు అమ్ముకోడానికి ఈ తోఫాలు పెట్టి దోచుకున్నావు. రంజాన్‌కి హెరిటేజ్ సేమ్యా వండుకుని తింటే మైనార్టీలు ఎదిగిపోయినట్లే అంటాడు. కానీ తన హయాంలో ఐదేళ్లలో మంత్రి మాత్రం ఉండడు. గుంటూరు ఛానల్‌ను పరుచూరు తెస్తా.. ప్రకాశం జిల్లాను గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తాను అంటున్నాడు. 2014–19 మధ్య గుంటూరు ఛానల్ పరుచూరు వరకూ తీసుకెళ్లేందుకు కాళీ దొరకలేదా?. ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఈ ఐదేళ్లు రూ.70వేల కోట్లు విద్యకు ఖర్చు పెట్టి చదువు ప్రభుత్వ బాధ్యత అని భుజానకెత్తుకున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రెండెకరాల రైతు కడుపున పుట్టి చంద్రబాబు రెండు లక్షల కోట్లకు ఎలా ఎదగాలో నేర్చుకున్నాడు తప్ప ఏ పేదవాడికి ఆ విద్య నేర్పలేదు. ఆ విద్యను తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు మాత్రమే నేర్పించాడు’ అని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు పేర్ని నాని.