Perni Nani: చంద్రబాబు అరెస్ట్‌తో న్యాయం, ధర్మం గెలిచిందని తెలుగు ప్రజల్లో ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 1977 నుంచి చంద్రబాబు ఎన్నో స్కాములు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని నాని విమర్శించారు. వాటిపై ప్రభుత్వాలు, వ్యవస్థలోని వ్యక్తులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు కుయుక్తులు, నక్క జిత్తుల మారితనంతో పట్టుబడకుండా స్టేల మీద ఏమార్చుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పారని అన్నారు.


ఇన్నేళ్లకు పాపం పండింది
నూరు గొడ్లను తిన్న రాబందు, ఒక తుఫాన్‌కు నేల కూలినట్లు, గంధం చెట్ల వీరుడు వీరప్పన్ కూడా ఎన్నో ఏళ్లు ఎవరికి చిక్కుండా హీరోలా ఉన్నాడని, కానీ ఒక్క నిజాయితీపరుడైన అధికారికి చిక్కారని అన్నారు. ప్రతివ్యవస్థలో తాను ఏర్పచుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా దొరకకుండా నీతులు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచం ఇస్తూ దొరికిపోయి అమరావతి పారిపోయి వచ్చారని అన్నారు. ఇన్నేళ్లకు పాపం పండిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 371 కోట్ల రూపాయలను దోచేశారని, ఈ కేసు కేవలం తీగ మాత్రమే అన్నారు. దాని పట్టుకుని లాగితే డొంక అంతా కదులుతుందన్నారు.


చంద్రబాబును కాపాడడానికి అందరూ పోరాటం
చంద్రబాబును కాపాడానికి యత్నిస్తున్న ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్, వామపక్షాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ పడుతున్నారని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనకు ముందే సమాచారం ఉందని, అందుకే కాలువ శ్రీనివాసులు, ఎల్లో మీడియాను రాత్రంతా గొట్టాలు పెట్టి అక్కడే కాచుకు కూర్చుందన్నారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు ఈనాడు రామోజీ రావు  ఏ 1 ముద్దాయి లోపలికి అని రాశారని, కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాశారని అన్నారు. కులపిచ్చితో రామోజీ రోత రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు చంద్రబాబును హెలికాఫ్టర్‌లో వెళ్దామంటే కావాలనే కారులో వెళ్లారని  విమర్శించారు.


సానుకూలంగానే సీఐడీ అధికారుల స్పందన
చంద్రబాబుకు చెందిన ప్రతి విషయంలో సీఐడీ అధికారులు సానుకూలంగానే స్పందించారని అన్నారు. దారి మధ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలను కలవడానికి అవకాశం ఇచ్చారని అన్నారు. సీఐడీ కార్యాలయంలో కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, బాలకృష్ణను కలిసేందుకు అంగీకరించారని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు చెప్పిన సమాధానాలు వింటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పలు సార్లు చంద్రబాబుకు అధికారులు విశ్రాంతి ఇచ్చారని అన్నారు. ఆస్పత్రిలో  పరీక్షలకు ఒప్పుకోలేదని, తనకు వైద్య పరీక్షలు అవసరం లేదని చెప్పిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జైలులో ప్రత్యేక వసతులు కల్పనకు ప్రభుత్వం, సీఐడీ తరఫున అధికారులు అభ్యంతరం కూడా చెప్పలేదన్నారు.


వాళ్లు ఎందుకు పారిపోయారో చెప్పండి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే సీఐడీ నోటీసులు ఇవ్వగానే ఆయనకు లంచాలు ఇచ్చిన ఇద్దరు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిసినప్పుడు 5 చార్టెడ్ విమానాలు ఏర్పాటు చేశారని, అవి ఎలా వచ్చాయని అడిగారు. ఢిల్లీలో రోజుకు 1.5 కోట్లు తీసుకునే వ్యక్తి సిద్ధార్థ్ లూధ్రాను లాయర్‌గా పెట్టుకున్నారని, వివేకానంద కేసులో సైతం లూధ్రాకు చంద్రబాబు ఫీజు కడుతున్నారని ఆరోపించారు.  నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుటి నుంచి రాజమండ్రి జైలులో ప్రత్యేక రూమ్ కల్పించినంత వరకు అధికారులు చంద్రబాబుకు ఎంతో మర్యాద ఇచ్చారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై నెల్లూరు కోటంరెడ్డి బ్రదర్స్ యాక్షన్ కామెడీగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష లేదన్నారు. కేవలం మర్యాద, గౌరవం ఉందన్నారు. అవినీతికి పాల్పడడంతోనే ఆయన అరెస్ట్ జరిగిందన్నారు. 


అవినీతి సొమ్ములో పవన్‌కు వాటా
ఉత్త పుత్రుడి కంటే దత్త పుత్రుడు ఓవర్ యాక్షన్ చేశాడని, చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు రోడ్డుపై పొర్లాడాడని నాని విమర్శించారు. జనసేన సిద్ధాంతాలు నేతి బీరకాయలో నెయ్యి లెక్కలో ఉంటాయన్నారు. పవన్ సినిమా డైరెక్టర్లు, రచయితలతో మాటలు రాయించుకుంటే బాగుంటుందని, కానీ సొంతంగా తీస్తే అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. నిన్న పవన్ ప్రెస్ మీట్‌కు స్క్రిప్ట్ రాయడానికి ఎవరు దొరికి ఉండరని, అందుకే  నోటికి వచ్చిందంతా మాట్లాడారని విమర్శించారు. ఇండ్ల రామసుబ్బారెడ్డి వద్ద పవన్ మానసిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును పవన్ నిలదీయాల్సింది పోయి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. అవినీతి సొమ్ములో పవన్‌కు వాటాలు ఉన్నాయని అన్నారు.