pawan Kalyan :   అకాల వర్ష బాధిత రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. బుధవారం  తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శిస్తారు. తర్వాత   కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా తూ.గో, ప.గో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో..  రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించింది.


భారీగా నష్టపోయిన ధాన్యం రైతులు                                   


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 16 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 60 శాతం కోతలు పూర్తయ్యాయి. 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కేవలం మూడు లక్షలు మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేసింది. మిగిలిన 4.50 లక్షల టన్నుల్లో 1.50 లక్షల టన్నులు ప్రయివేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా. మిగతా ధాన్యం రైతుల కళ్లాల్లో, ఆరుబయట ఉంది. ఈ  మధ్యలో అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయాయి. 


తడిచిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం                              


 తడిచిన ధాన్యం  కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మొలక వచ్చిందని, రంగు మారిందని, తేమ శాతం అధికంగా ఉందని చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కళ్లాల్లోనూ, ఆరుబయట ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి ఒక్కో బరకాకు రోజుకు రూ.25 చొప్పున అద్దె చెల్లించాల్సి వస్తోంది. గోనె సంచులు ఇస్తే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తామని రైతులు అంటున్నా అధికారుల్లో స్పందన లేదు. తేమ శాతం, నూక, తాలు పేరిట మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆదుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలోకి రావట్లేదు !


మరో వైపు ఆదుకుంటామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అమల్లో కి రావడంలేదు . మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో ఆందోళనతో ఉన్నారు. నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన సమయంలో కొంత మేర కొనుగోలు చేశారు. ఇప్పుడు పవన్ పర్యటనకు వస్తున్నందున పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నారు.