Pawan Kalyan Speech in Anantapur: "ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నాం. మా ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా మరచలేదు. ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయి" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' బహిరంగ సభలో ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
ఈ సభలో పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వం 15 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాయలసీమ అభివృద్ధి గురించి వివరించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడులు ఆకర్షించడం, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రశంసించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ వెనుకబడినది కాదు. మేము దీన్ని రత్నాల సీమగా మలిచి, ప్రజలకు సమృద్ధి, ఉపాధి అవకాశాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ లక్ష్యానికి పెట్టుబడులు ఆకర్షించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారం మొదలైన కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు.
"ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందుతారన్నారు. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మేము ప్రజలతో పాటు పాలిస్తున్నాం, వారి సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామని ఆయన అన్నారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. "యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, రైతులకు సబ్సిడీలు, నీటి సౌకర్యాలు అందిస్తున్నాం. ఈ పథకాలు రాబోయే తరాలకు శాశ్వత ప్రయోజనం కలిగిస్తాయి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
"ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. ఈ సభల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరిస్తున్నాం. పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాం" అని ఆయన తెలిపారు. "కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చలు చేస్తాం, వాతావరణ సమతుల్యతను కాపాడతాం. ప్రతి పౌరుడు ఈ ప్రయత్నంలో పాల్గొనాలి" అని పిలుపునిచ్చారు.