Mudragada: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ కలవలేదు. గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చి చాలా మందిని కలిశారు కానీ ముద్రగడ వైపు వెళ్లలేదు. మొదట వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని.. జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ఎక్కడా టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం.. టిక్కెట్ల కసరత్తు లో అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్
ముద్రగడను కలిసిన జనసేన నేతలు.. పవన్ కల్యాణ్ ఇంటికి వచ్చి మరి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయనకు భరోసా కల్పించారు. అయితే, ఈ ప్రచారం నెల రోజులు దాటినా కూడా ముద్రగడను మాత్రం జనసేనాని కలవలేదు. రెండు రోజుల వ్యవధిలో భీమవరం, రాజమండ్రిలో పర్యటించినప్పటికి ముద్రగడను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. దీంతో, ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీ లేనట్లేనని తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే జనసేన తప్ప మిగితా అన్ని పార్టీలు ముద్రగడకు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. పవన్ రాకపై ముద్రగడ స్పందిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం..చేసేది ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ముద్రగడ - టిక్కెట్ ఇవ్వని వైసీపీ
పది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ..త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేశాయి. ఏపీ రాజకీయాల్లో కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతూ లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.
ముద్రగడ కాపు సామాజికవర్గంలో నమ్మకం కోల్పోయారా ?
ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలోనూ తన పలుకుబడి కోల్పోయారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది. అయితే ఈ అంశంపై ముద్రగడ పద్మనాభం పెద్దగా స్పందించలేదు. పైగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నందన తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించారు. ఇలాంటి పరిణామాలతో ముద్రగడ రాజకీయంగా పలుకుబడి కోల్పోయారని రాజకీయ వర్గాలంటున్నాయి.