Pawan Kalyan meets Chandrababu at vundavalli home: అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. శనివారం డిన్నర్ మీట్ లో భాగంగా చంద్రబాబు, పవన్ భేటీ కాగా, ఇందులో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు. ఇరు పార్టీల కీలక నేతల భేటీ కావడంతో టీడీపీ, జనసేన.. ఉమ్మడి మేనిఫెస్టోపైన, సీట్ల పంపిణీ పైన చర్చించే అవకాశం ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో, ఎక్కడెక్కడ నుండి బరిలోకి దిగాలి అని కీలకంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు జనసేనకు 40 సీట్లు కచ్చితంగా డిమాండ్ చేయాలని కాపు నేతలు పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.




తొలిసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్.. 
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇదివరకే పలుమార్లు సమావేశం అయినప్పటికీ.. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి పవన్ తొలిసారిగా వెళ్లారు. ఆయనతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. పవన్, నాదెండ్లకు స్వాగతం పలికారు. శాలువా కప్పి జనసేన నేతల్ని ఆహ్వానించారు. అనంతరం టీడీపీ, జనసేన అగ్రనేతల మధ్య డిన్నర్ మీటింగ్ మొదలైంది. అయితే చంద్రబాబు, పవన్ ల తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనుంది. బలమైన స్థానాల్లోనే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. బలహీనమైన స్థానాలు తీసుకుంటే వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని.. జనసేనాని అనుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టోపై సైతం ఈ భేటీలో కీలకంగా చర్చ జరగనుంది. సంక్రాంతి తరువాత మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.


తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం పేరుతో భోగి మంటలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ 14న భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొననున్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమం పేరిట అమరావతి రాజధాని పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న భోగి వేడుకల్లో ఉదయం 7 గంటలకు పాల్గొంటారు. జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తారు. జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు – పన్నుల బాదుడు, జె.బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటిస్తారు.