Janasena Sena tho Senenai: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుంది. మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రిజిస్టర్ చేసుకునే అవకాశాల్ని కల్పించారు.
సేనతో సేనాని కార్యక్రమం ఆగస్టు 28 నుంచి 30 వరకు విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో విస్తృత స్థాయిలో జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, యువత వేలాదిగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమాజ సేవలు చర్చించారు. పోరాటం చేసేవాడే వీరుడు కాదు, అండగా నిలబడిన ప్రతి ఒక్కరూ వీరులే అని ఆయన అన్నారు. ఆ సమావేశం స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ ఏర్పాటుచేశారు. పాల్గొనాలనుకునే యువత QR కోడ్ స్కాన్ చేసి లేదా లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పార్టీ అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లలో QR కోడ్ అందుబాటులో ఉంది. లైవ్ స్ట్రీమింగ్ కోసం యూట్యూబ్ లింక్: https://www.youtube.com/live/Xxj7UsGllrQ.
ఈ కార్యక్రమం జనసేన పార్టీకి రెట్టింపు బలాన్ని ఇస్తుందని, యువతను సమాజ సేవలోకి తీసుకువచ్చి భవిష్యత్ నాయకులను తయారు చేస్తుందని భావిస్తున్నారు.