Deputy CM Pawan Kalyan: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం కేంద్రం నుంచి 2వేల కోట్లు - ప్రతి గ్రామానికీ మంచి రహదారులు - పవన్ కల్యాణ్ ఆదేశం
Pawan Kalyan : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి రెండు వేల కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయని సద్వినియోగం చేసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Centre has allocated Rs 2,000 crores for rural roads: రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కి నిధులు సమకూరాయని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి తీసుకువచ్చిన నిధులు ఇవి. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుపైనా, అధికార యంత్రాంగంపైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నాము. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయాలన్నారు. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తామని ప్రకటించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవి. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో ఈ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లు పటిష్టపరచాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు వివరించారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఈ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలకమైన అభివృద్ధి పనులకు సాస్కి నిధులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు.
రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించింది. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోంది. నిధులు పొందటంలో, వాటిని వినియోగించే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలని స్పష్టం చేశారు.





















