Pawan Kalyan called devotees For Hindu Dharma: తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం మొదలుకొని హిందూ దేవాలయాల పవిత్రతపై జరుగుతున్న దాడులను ఉదహరిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భక్తులకు కీలకమైన పిలుపునిచ్చారు. ప్రతి భక్తుడికీ ఒక ధార్మిక బాధ్యత ఉంటుందని, దేవుడిపై కేవలం భక్తి ఉంటే సరిపోదని, ఆ భక్తికి రక్షణ కవచంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. మన ఆరాధ్య దైవాలను లేదా ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేసినప్పుడు బాధపడుతూ మౌనంగా ఉండిపోవడం ఇకపై సరికాదని..తమ ఆగ్రహాన్ని గళమెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఇంగ్లిష్‌లో, హిందీలో పోస్టులు పెట్టారు.
మన విడిపోయిన మన ఆరాధ్య దైవాలు ఒక్కటే !
మనం కులాలు, భాషలు, ప్రాంతాలు లేదా వివిధ పద్ధతులతో విడిపోయి ఉండవచ్చు, కానీ మన ధర్మం, మన ఆరాధ్య దైవాలు ఒక్కటేనని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని , భక్తుల విశ్వాసాలను అవమానించినప్పుడు... భక్తులు తమ ఆగ్రహాన్ని బహిరంగంగా నిరసించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మౌనంగా ఉండటం వల్ల హిందూ ధర్మం గొంతు బలహీనపడుతుందని, అందుకే ప్రతి భక్తుడు కేవలం ఆరాధకుడిగానే కాకుండా తన విశ్వాసానికి రక్షకుడు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ధర్మ పరిరక్షణ ఇతర మతాలకు వ్యతిరేకం కాదు!
ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా వివరించారు. ఎవరినీ అవమానించడం లేదా ఎవరిపైనో ద్వేషం పెంచుకోవడం హిందూ ధర్మం ఉద్దేశం కాదని, కేవలం మన ధర్మం గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం మాత్రమేనని ఆయన నొక్కి చెబుతున్నారు. సనాతన ధర్మం వసుధైవ కుటుంబకం అని బోధిస్తుందని, అయితే ఆ ధర్మాన్ని అగౌరవపరిచే వారి పట్ల మౌనంగా ఉండటం చేతకానితనం అవుతుందని ఆయన హెచ్చరించారు.
ఏపీ పరిణామాలతో పవన్ మరింత దూకుడుగా ధర్మరక్షణ ఉద్యమం
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కల్యాణ్ రాజకీయాలకు అతీతంగా ధర్మ రక్షణ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతాన్ని వదిలేసి ముందుకు వెళ్లే ధోరణిని పక్కనపెట్టి, వర్తమానంలో ధర్మం పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని ఆయన కోరుతున్నారు. ఇందుకోసం వారాహి సనాతన ధర్మ రక్షణ వింగ్ వంటి వేదికలను కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. భక్తిని సామాజిక బాధ్యతతో ముడిపెడుతూ ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
