Deputy CM Pawan Reaction:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు వ్యక్తం చేసిన ఆవేదనకు స్పందించి, తక్షణమే రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.  విద్యార్థుల పిలుపు.. పవన్ కళ్యాణ్ స్పందన 

Continues below advertisement

"పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లి విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. బురద రోడ్డులో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులతో మాట్లాడి గజ్జలవారిపల్లి గ్రామ సమస్యపై పూర్తి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మంజూరు 

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులు రంగంలోకి దిగారు. గజ్జలవారిపల్లి నుంచి స్కూలుకు వెళ్లే 1.6 కిలోమీటర్ల మేర ఉన్న బురద రోడ్డును బాగు చేసేందుకు రూ. 86 లక్షలతో అంచనాలను రూపొందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు  మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి రవాణా కష్టాలు తీరనున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి వెల్లువ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం రోడ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే 'పల్లె పండుగ' 1.0 ,  2.0 కార్యక్రమాల కింద సుమారు రూ. 55 కోట్ల నిధులతో 641 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 437 రోడ్ల పనులు తుది దశకు చేరుకోగా, మరో 200 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి అదనంగా సాస్కీ  నిధుల నుంచి రూ. 9 కోట్లతో దుత్తలూరు, కొండాపురం, సీతారాంపురం , వింజమూరు మండలాల్లోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.

 ప్రజా ప్రభుత్వం - తక్షణ పరిష్కారం 

సాధారణంగా ప్రభుత్వ పనులు మంజూరు కావడానికి నెలల సమయం పడుతుంది, కానీ గజ్జలవారిపల్లి ఘటనలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవతో అది ఒక్కరోజులోనే సాధ్యమైంది. సమస్య ఏదైనా, అది ప్రజల నుంచి వస్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఈ ఘటనతో స్పష్టమైంది. తమ అభ్యర్థనపై స్పందించి రోడ్డు మంజూరు చేసినందుకు గజ్జలవారిపల్లి గ్రామస్తులు , విద్యార్థులు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.