Bail For Pattabhi : గన్నవరంలో జరిగిన ఘర్షణల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అటు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను.. ఇటు పట్టాభిరామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. కస్టడీ పిటిషన్లను తోసి పుచ్చి.. పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. పాతిక వేల చొప్పున ఇద్దురు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. పట్టాభిరామ్ అసలు దాడి జరిగిన ప్రదేశంలో లేరని రాజకీయ కారణాలతోనే కేసులు పెట్టారని లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పట్టాభిరాం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
గన్నవరంలో జరిగిన ఘర్షణల్లో సీఐపై హత్యాయత్నం జరిగిందని పట్టాభిపై కేసు
పది రోజుల కిందట గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు వెళ్లారు. అలా వెళ్లిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత ఇంటిపై దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం వచ్చానని పట్టాభి చెప్పారు. అయితే ఆయన కారుపై దాడి జరిగింది. పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. తర్వాతి రోజు .. సీఐ కనకారావుపై జరిగిన రాళ్ల దాడికి కారణం పట్టాభినేనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ వన్ గా పట్టాభి పేరు పెట్టి.. అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
పోలీసులు కొట్టారని ఆరోపించిన పట్టాభి
అయితే పోలీసులు తనను కస్టడీలో కొట్టారని పట్టాభి కోర్టులో హాజరు పరిచిన సమయంలో చెప్పారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన తర్వాత చేతికి మాత్రమే వాపు ఉందని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో జైలుకు తరలించారు. గన్నవరం జైల్లో ఉంటే శాంతిభద్రతల సమస్య వస్తుంది కాబట్టి రాజమండ్రికి తరలించాలని పోలీసులు పిటిషన్ పెట్టుకోవడంతో కోర్టు అంగీకరించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. అప్పట్నుంచి రాజమండ్రి జైల్లోనే పట్టాభిరాం ఉన్నారు. అయితే అది అక్రమ అరెస్టు అని అసలు కేసు పెట్టిన సీఐ ఎస్సీ కాదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీలో శాంతిభద్రతలు లేవన్న టీడీపీ
గన్నరవరం అంశంపై రాజకీయ దుమారం రేగింది. సీఐ తప్పుడు కేసులు పెట్టారని .. టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మరో వైపు పోలీసులు కూడా కుట్ర పూరితంగా సీఐపై హత్యాయత్నానికి కారణం అయ్యారని కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసి.. తమ ఆస్తులు ధ్వంసం చేసింది కాకుండా తమపైనే కేసులు పెట్టారని.. టీడీపీ ఆరోపించింది. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం అని విమర్శలు గుప్పిస్తున్నారు.