Paritala Sunitha on YS Jagan: జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుళ్లు, కుతంత్రాలతో పాలన సాగిందని.. ఇప్పుడు అధికారం పోయాక కూడా ఆయన పైశాచిక చర్యలు మానడం లేదని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి విజయవాడలో చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తన పాలనలో ఐదేళ్లూ.. కక్ష సాధింపులు, దాడులు, అక్రమ అరెస్టులతో కనిపించాయని అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా.. దానిపై రాద్దాంతం చేస్తూ రాష్ట్రపతి పాలన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శలు చేస్తూ.. ఎక్కడ ఎవరు వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నా దానిని టీడీపీకి ఆపాదిస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 30 రోజుల్లో 36 మంది వైసీపీ నేతలు హత్యకావించబడ్డారని... ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేశారని మండిపడ్డారు. మరి ఆ 36 మంది వ్యక్తుల పేర్లు, వివరాలు ఇవ్వమని అడిగితే సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి చేస్తున్న ఈ విష ప్రచారాల వలన రాష్ట్రానికే చెడ్డ పేరు తెచ్చేలా ఉందన్నారు. విజయవాడ సంఘటనలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ ను సైతం రెచ్చగొడుతున్నారని సునీత అన్నారు. 


నేను చెప్పినా.. వైసీపీ క్యాడర్ వినదంటే.. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలన్నారు. నీ హయాంలో ఎంత దౌర్జన్య కాండ జరిగిందో చెప్పడానికి రాప్తాడు నియోజకవర్గం ఒక్కటి చాలన్నారు. అదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగాయా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ.. అభివృద్ధి కాకూడదన్న కుట్రతో జగన్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


గత 5 ఏళ్లల్లో జరిగిన వ్యవస్థల విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేసి పరిపాలనను గాడిలో పెడుతున్నారన్నారు. శాంతిభద్రతలను కాపాడటం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమల్ని ఆకర్షించాలని ఆయన తపిస్తున్నారని సునీత అన్నారు. ఇలాంటి సమయంలో జగన్ చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.