Anantapur News: వచ్చే మూడు రోజులు పాటు ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులంతా గ్రామాల్లో ఉండాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో రెండు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఇతర ముఖ్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంటల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ఈ ఖరీఫ్ లో వర్షాలు సరిగా కురువక వేరుశనగ, కంది, ఆముదం వంటి పంటలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రైతుకు పంట నమోదు అన్నది చాలా ముఖ్యమని ఆమె అన్నారు.
పార్టీలకు అతీతంగా రైతులు సాగుచేసిన ప్రతి పంటకు ఈక్రాప్ నమోదు కావాలని ఆమె స్పష్టంగా ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుతం 80 శాతం సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలైన ఉలవలు, పెసలు, అలసందలు, జొన్నలు ప్రభుత్వం అందిస్తోందని ఇలాంటి సమయంలో.. వీటిని రైతును తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
ప్రభుత్వం అందించే కార్యక్రమాల గురించి గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి నుంచి 3రోజులు సెలవులు ఉన్నా కూడా.. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో రైతుల పొలాలను సందర్శించాలన్నారు. రైతులు కూడా వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించి తప్పకుండ ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని పరిటాల సునీత అన్నారు.