Former Minister Son Kills Shepherd Danayya: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో సంచలనం సృష్టించిన గొర్రెల కాపరి హిట్ అండ్ రన్  ప్రమాద కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడైన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పెద్ద కుమారుడు ఆరవ్ ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన తరఫు న్యాయవాదులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడితో అసలు నిందితుడు తనేనని తేలడంతో ఆరవ్ లొంగిపోక తప్పలేదు.

Continues below advertisement

 అతివేగం.. అమాయకుడి బలి! 

ఈ ఘోర ప్రమాదం జూలై 10వ తేదీ శుక్రవారం రాత్రి పలాస పారిశ్రామిక వాడ పరిధిలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పలాస మండలం సూదికొండ గ్రామానికి చెందిన దుబ్బ దానయ్య అనే నిరుపేద గొర్రెల కాపరి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆరవ్   రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్  AP 40AF 9994 బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ భయంకరమైన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన దానయ్య రోడ్డుపైనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరగ్గానే స్థానికులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, రాజకీయ పలుకుబడితో ఆరవ్‌ను వెంటనే ఓ కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు.

Continues below advertisement

 కేసును మార్చేందుకు  డమ్మీ నిందితుడు..  

ప్రమాదం జరిగిన వెంటనే ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించి, మాజీ మంత్రి కుమారుడిని రక్షించేందుకు తెరవెనుక పెద్ద స్కెచ్ వేశారు. బైకు యజమాని,  వైసీపీ  మున్సిపల్ కౌన్సిలర్ కుమారుడైన సిద్ధార్థ తానే ప్రమాద సమయంలో బైక్ నడిపినట్లు పోలీసుల ముందు నాటకమాడాడు. పోలీసులు కూడా ప్రాథమికంగా లోతుగా విచారించకుండానే.. ఆరవ్‌ను కేసు నుంచి పూర్తిగా తప్పించి, సిద్ధార్థ్‌పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, అతనికి తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి రాత్రికి రాత్రే పంపేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు బాధిత కుటుంబానికి దాదాపు రూ. 9 లక్షల వరకు ముట్టజెప్పి రాజీ కుదిర్చేందుకు కూడా సీదిరి అనుచరవర్గం గట్టిగా ప్రయత్నించినట్లు సమాచారం.

 నిజం నిగ్గుతేల్చిన పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్! 

అయితే, ఒక సామాన్య గొర్రెల కాపరి మృతిపై స్థానికులు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో కాశీబుగ్గ పోలీసులు ఆదివారం ఈ కేసుపై పునరాలోచన చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన రూట్‌లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టగా, కాశీబుగ్గలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఆరవ్ స్వయంగా ఆ బుల్లెట్ బైక్‌కు పెట్రోల్ పోయిస్తున్న విజువల్స్ స్పష్టంగా లభించాయి. ప్రమాద సమయంలో బైక్ నడిపింది, ప్రమాదానికి కారణమైంది ముమ్మాటికీ మాజీ మంత్రి కుమారుడు ఆరవ్వేనని ఈ సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించారు.

 విచారణలో ఉన్నతాధికారులు.. రాజకీయంగా హీట్! 

చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన ఆరవ్, సోమవారం లాయర్లతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ హిట్ అండ్ రన్ కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అసలు నిందితుడిని తప్పించేందుకు సహకరించిన పోలీసు అధికారులు ఎవరు? కావాలనే కేసును తప్పుదోవ పట్టించారా? అనే కోణంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. అధికార పార్టీ కూటమి నేతలు కూడా ఈ అంశంపై సీరియస్‌గా స్పందిస్తూ బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.