Nimmaka Jayakrishna Joins Janasena:  ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.      పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మరోసా ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహ లాడుతున్నారు. అటు కూటమి వైపు మాత్రం అభ్యర్థి ఎవరు అనేదే ఇంకా తేలలేదు.  


పాలకొండ టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న జయకృష్ణ                                      


పాలకొండ నియోజకవర్గంలో ముందు నుంచి YCP వర్సెస్ TDP మధ్య ప్రధాన పోరు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షంలా సొంత పార్టీ నాయకుల అసమ్మతి పోరు నెలకొంది. జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ పార్టీలోని ఓ వర్గం సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్‌ను ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలో సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. జనసేనకు బలమైన అభ్యర్థి కొరత ఉండటంతో నిమ్మక జయకృష్ణ  పవన్  కల్యాణ్ తో చర్చలు జరిపి ఆ పార్టీలోకి చేరిపోయారు. టిక్కెట్ ఆయనకే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై పవన్ కల్యాణ్ సర్వే నిర్వహింపచేసినట్లుగా తెలుస్తోంది. 


జనసేనకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో  జయకృష్ణ చేరిక                                


“పవన్ సమక్షంలో జనసేనలో చేరానని.. పాలకొండ నుంచి జనసేన తరపున పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నారన్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్ కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరిని కూటమి తరపున తరిమి కొడతామన్నారు నిమ్మక జయకృష్ణ.


జనసేనలో చేరిన అవనిగడ్డ టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్                              


టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలు జనసేన పార్టీకి వెళ్లాయి. దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించింది. 21 స్థానాల్లోనూ కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్  టీడీపీ నేతలకే అవకాశం కల్పిస్తున్నారు.