Jahnavi Set to Go to Space: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణానికి చెందిన దంగేటి జాహ్నవికి అరుదైన ఘన సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన జాహ్నవి NASA అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయురాలు. జాహ్నవి పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పాలకొల్లులోనే చదివారు. అంతరిక్ష అంశంపై ISRO ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు, NITలు వంటి ప్రముఖ సంస్థలతో సహా ప్రతిష్టాత్మక వేదికలపై ప్రభావవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. ప్రసంగాలు ఇచ్చారు. జాహ్నవి తల్లిదండ్రులు శ్రీనివాస్ , పద్మశ్రీ . ఇద్దరూ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
పాలకొల్లులోనే ఇంటర్ వరకూ చదువు
జాహ్నవి నాసా సిద్ధం చేస్తున్న టైటాన్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్ ప్రయాణంలో భాగం కానుంది. 2029లో ఈ ప్రయాణం ఉంటుంది. తనలాగే అంతరిక్షంపై ఆసక్తి ఉన్న వారందరికీ సాయం చేయడానికి జాహ్నవి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు అంతరిక కెరీర్ లోకి వెళ్లడానికి సాయం చేయాలనుకుంటున్నానని చెబుతున్నారు. పాలకొల్లు వంటి చిన్న పట్టణంలో జన్మించానని.. చాలా మంది అంతరిక్షంలోకి వెళ్లలేరని అనుకుంటారన్నారు. కానీ ప్రయత్నిస్తే సాధించగలరని ఆమె చెబుతున్నారు.
జాహ్నవి అతి పిన్న వయస్కురాలైన విదేశీ అనలాగ్ వ్యోమగామి
జాహ్నవి అంతరిక్షంలో అంతర్జాతీయ ఖగోళ పరిశోధనలో సహకారం అందిస్తారు. శాస్త్రీయ డేటాబేస్‌లు మెరుగుపరిచే గ్రహశకల శోధనలోనూ పాల్గొంటారు. జాహ్నవి అతి పిన్న వయస్కురాలైన విదేశీ అనలాగ్ వ్యోమగామి , స్పేస్ ఐస్లాండ్ జియాలజీ శిక్షణకు ఎంపికైన మొదటి భారతీయురాలు. ఆమె పీపుల్స్ ఛాయిస్ అవార్డు - NASA స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌ను గెలుచుకుంది.
దంగేటి జాహ్నవికి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటివరకు భారతదేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ మహిళా అంతరిక్ష యానానికి నేరుగా ఎంపిక కాలేదు. తొలిసారి జాహ్నవి ఆ ఘనత సాధించారు. జాహ్నవి ఈ విజయం భారతీయ మహిళలకు, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచిందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఆమె చిన్న వయస్సులోనే NASA శిక్షణ పొందడం ,టైటాన్స్ స్పేస్ మిషన్‌లో ఎంపిక కావడం ఆమె సాహసం, నిబద్ధతను చూపిస్తున్నాయని ప్రశంసిస్తున్నారు.