ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఏపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా రావడంపై ఆయన స్పందించారు. ఇదంతా ఒక కుట్ర అని కొట్టిపారేశారు. ఇది సౌత్ ఇండియా వ్యాపారులపై ఉత్తరాది వారు చేస్తున్న కుట్ర అని విమర్శించారు. అందులో భాగంగానే ఛార్జ్ షీట్ లో తమ పేర్లు చేర్చారని పేర్కొన్నారు. తనకు, తన కుమారుడికి సౌత్ గ్రూప్ లో ఎలాంటి షేర్లు లేవని ఎంపీ మాగుంట చెప్పారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అనుచరుడైన అమిత్ అరోరాతో తాను కానీ, తన కుమారుడు కానీ ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. తప్పుడు ఆరోపణలపై గతంలో కూడా తాను వివరణ ఇచ్చినట్టు గుర్తు చేశారు. మళ్లీ తీరిక చూసుకొని త్వరలోనే ప్రెస్ మీట్ పెడతానని, అన్నీ వివరిస్తానని ఎంపీ మాగుంట చెప్పారు.
లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పేరు కూడా చేర్చడంతో తాను ఆశ్చర్యపోయానని ఎంపీ అన్నారు. గతంలో తాను లిక్కర్ వ్యాపారాలు చేసిన మాట కరెక్టేనని, ఇప్పుడు తాము గానీ, తమ కుటుంబ సభ్యులు గానీ అసలు ఆ వ్యాపారాలు చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెప్తానని అన్నారు.
ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. అమిత్ అరోరా కస్టడీ కోరుతూ బుధవారం కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల పేర్లు సహా మరికొందరు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, స్రుజన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.
అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా.. దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పని చేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. అమిత్ అరోరా బడ్జీ అనే ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా తొమ్మిదవ నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.