ED Notices To MP Magunta :  దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు(మంగళవారం) విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న ఈడీ విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు అయ్యారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 18న ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారు. తన సోదరుడు కుమారుడికి అనారోగ్యంగా ఉన్న కారణంగా శనివారం విచారణకు రాలేనని ఈడీకి ఎంపీ మాగుంట లేఖ రాశారు. సౌత్‌ గ్రూపులో కీలకంగా ఉన్న వ్యక్తుల్లో ఎంపీ మాగుంట ఒకరని ఈడీ అభియోగాలు చేస్తుంది.  దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్టు అయిన మాగుంట కుమారుడు రాఘవ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ పొడిగించింది.  


మాగుంట రాఘవకు రిమాండ్ పొడిగింపు 


 దిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక నేతలను సీబీఐ అరెస్టు చేస్తుంది. ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఫిబ్రవరి 10న ఈడీ అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే పలుమార్లు మాగుంట రాఘవ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ నెల 28 వరకు ఆయన రిమాండ్ పొడిగించింది. మాగుంట రాఘవ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు.  


రూ.100 కోట్ల ముడుపులు 


 దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10న  ఈడీ అరెస్టు చేసింది. అనంతరం దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించింది.  దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్‌ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి.   


ఈ కేసులో సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సోమవారం ఈడీ విచారిస్తుంది. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై, ఎమ్మెల్సీ కవితను కలిసి సుమారు నాలుగు గంటలు విచారించింది ఈడీ.