Notices to priests of Vonti Mitta Ram Temple: ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించడం ప్రస్తుతం టీటీడీలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చెందిన అర్చకులు ఎ. శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె. పార్థసారథిలు ఇటీవల పులివెందులకు వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అయితే, టీటీడీ పరిధిలో పనిచేసే అర్చకులు ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ, ఈ ముగ్గురు అర్చకులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా వెళ్లడం నిబంధనల ఉల్లంఘనగా అధికారులు భావిస్తున్నారు. కేవలం ఆశీర్వచనం ఇవ్వడమే కాకుండా, ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన శేష వస్త్రాన్ని, రాములోరి తోమాలను, ముత్యాల తలంబ్రాలను జగన్‌కు అందజేశారు. సాధారణంగా ఇవి ప్రభుత్వం తరపున అధికారికంగా లేదా అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు ప్రోటోకాల్ ప్రకారం అందజేయాల్సి ఉంటుంది. అర్చకులు తమ స్వంత నిర్ణయంతో వీటిని తీసుకువెళ్లి అందజేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, ఇది అర్చకుల అత్యుత్సాహమేనని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీటీడీ నిబంధనలను అతిక్రమించి, రాజకీయ నాయకుల నివాసాలకు వెళ్లి ఆశీర్వచనాలు అందించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను వివరణ కోరారు. నోటీసులు అందుకున్న అర్చకులు శ్రావణ్ కుమార్, మనోజ్ కుమార్, పార్థసారథిలు రెండు రోజుల్లోగా తమ వివరణను లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు ఆదేశించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
