Kodi Kathi Case: కోడి కత్తికేసులో మరింత దర్యాప్తు అవసరమని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ఐఏ కోర్టులో గురువారం కౌంటర్లు దాఖలు అయ్యాయి. ఎన్ఐఏ తరఫున, నిందితుడు శ్రీనివాస రావు తరఫున కౌంటర్లు దాఖలయ్యాయి. ఈ కౌంటర్లపై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం కోడి కత్తి కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
కోడికత్తి కేసుపై జగన్ ఆసక్తి లేదు..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కోడి కత్తి కేసు విచారణపై ఆసక్తి లేదని, కోర్టుకు రాకుండా తప్పించుకునేందుకే మరింత సమయం కావాలని, మరింత దర్యాప్తు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది తన కౌంటర్ లో పేర్కొన్నారు. కోర్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే జగన్ ఉంటున్నా.. న్యాయస్థానానికి రావడానికి ఇష్టపడటం లేదని, చట్టంపై ఆయకు ఉన్న గౌరవాన్ని ఇది సూచిస్తుందని కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసి, అభియోగపత్రం కూడా దాఖలు చేసిందని తెలిపారు. సాక్షుల విచారణ ప్రారంభమైందని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని కానీ, కేసును మరింత దర్యాప్తు చేయాలని గానీ కోర్టు దృష్టికి తీసుకురాలేదని గుర్తు చేశారు. మొదటి సాక్షి అయిన విశాఖపట్నం విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ విచారణ సందర్భంగా కూడా కొత్త విషయాలు బయటకు రాలేదని కౌంటర్ లో తెలిపారు. అలాంటప్పుడు ఇప్పటికే పూర్తి అయిపోయిన దర్యాప్తును పక్కన పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొత్త అంశాలు వెలుగులోనికి రానప్పుడు మరింత దర్యాప్తు చేయాలని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. ఇలాంటి అభ్యర్థన నేర విచారణ ప్రక్రియను అగౌరవ పరచడమేనని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరింత దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి కొత్త సిద్ధాంతంతో అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు.
సీఎం జగన్ చట్టాన్ని గౌరవించాలి..!
సాక్షిగా కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తికి(సీఎం)కు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయని తెలిపారు. జగన్ చట్టాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. కానీ ఆయన దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సహేతుకం కాని కారణాలతో అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. అలాగే ఈ అఫిడవిట్ లో విచారణలో బయటకు రాని కొత్త విషయాలను పేర్కొనలేదని తెలిపారు. నేరుగా సీఎం అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎన్ఐఏ ను బైపాస్ చేశారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించడం ద్వారా.. కోర్టులో విచారణ సాగడం ఇష్టం లేనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకోవడానికే ఈ పిటిషన్ వేసినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే సీఎం ఉంటారని, అయినా ఆయన కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదని అన్నారు. ఇలాంటి చర్య చట్టంపై గౌరవాన్ని తగ్గించడమే అవుతుందని పేర్కొన్నారు.