ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. రెండున్నరేళ్లకే మొత్తం మంత్రి వర్గాన్ని మార్చాలని జగన్ అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని వైఎస్ఆర్‌సీపీ వర్గాలకు సంకేతాలు అందుతున్నాయి. వంద శాతం మంత్రుల్ని మార్చేస్తారని మంత్రి బాలినేని గతంలోనే ప్రకటించారు. దీంతో  ప్ర‌స్తుతం ఉన్న మంత్రులంతా మాజీలు కాబోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌దానంగా మంత్రి వ‌ర్గంలో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన వారికి కూడా తిరిగి  అవ‌కాశం కల్పించే అవకాశం లేదని వారికి పార్టీ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. 


విధేయత చూపే మంత్రులపైనా వేటు ఖాయమే  !


మంత్రి వ‌ర్గం బ‌ర్త్ ల కోసం ఎదురు చూస్తున్న వారు కాలం గ‌డిచే కొద్ది అస‌హనానికి  లోన‌వుతున్నారు. ఇక మంత్రి వ‌ర్గంలో ఉన్న వారు ఇలానే కంటిన్యూ అయిపోతె ఎంత బాగుంటుందో అనే కోణంలో సైలెంట్ అయిపోతున్నారు. ప్ర‌దానంగా మంత్రి వ‌ర్గంలో పేర్ని నాని, కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు వంటి వారు జ‌గ‌న్ పై ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌లకు ఘాటుగా సమాదానం ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని తీరు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంత్రి వ‌ర్గం నుండి తీసేసినా,ఎమ్మెల్యేగా ప‌ని చేయ‌క‌పోయినా,జ‌గ‌న్ కారు డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తానంటూ కొడాలి కామెంట్స్ చేశారు.


వివాదాస్పద మంత్రులకు గుడ్ బై ! 


అయితే కొడాలి నానికి విధేయతతో పాటు ఎన్నో మైనస్‌లు ఉన్నాయి. కొడాలి నాని గుడివాడ కేసినోవా వ్య‌వ‌హ‌రం, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాదా పై హ‌త్యా య‌త్నం ఎపిసోడ్ లు ఇర‌కాటంలోకి నెట్టాయ‌నే ప్ర‌చారం ఉంది. వంగ‌వీటి రాదా పై హ‌త్యా య‌త్నం ఎపిసోడ్ కూడ చివ‌రికి తుస్ అనిపించింది. రాధా పై దాడి చేసేందుకు రెక్కి జ‌రిగింద‌నే ప్ర‌చారానికి ఆదారాలు లేవ‌ని పోలీసులు కొట్టి పారేశారు.రాదా పై హ‌త్య‌కు కుట్ర విష‌యాన్ని కొడాలి స్వ‌యంగా జ‌గ‌న్ తో చ‌ర్చించి గ‌న్ మెన్ లను కేటాయిస్తే,రాదా తిర‌స్క‌రించారు.ఇది ప్ర‌భుత్వానికి సైతం ఇబ్బంది క‌లిగించిన అంశం..అటు కొడాలికి కూడ ఈ వ్య‌వ‌హ‌రం మింగుడుప‌ని అంశం గా చెబుతున్నారు. 


కొత్త వారిపై సీఎం జగన్‌కు క్లారిటీ ఉందా ?


ఇక వివాదాల్లో ఇరుక్కున్న కొంత మంది మంత్రులు ఇప్పటికే సైలెంట్‌గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కసర్తతు పూర్తి చేశారని అంటున్నారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేలా ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారని అంటున్నారు.  సీఎం జగన్‌కు ఏదీ నాన్చడం ఇష్టం ఉండదు. ఫటాఫట్ చేసేస్తారు. ఈ క్రమంలో వంద శాతం మంత్రులను మార్చడం ఖాయమని అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఉగాది కల్లా ప్రక్రియ పూర్తి చేస్తారని భావిస్తున్నారు.