నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన రోజే ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మరికొందరు నేతలను కూడా చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు, పార్టీ కండువా కప్పారు. 


10కి 10
2019లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుచుకుంది. ఈసారి టీడీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తెలుగుదేశం కుటుంబంలో తనను భాగస్వామిని చేసిన చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం అని, అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టీడీపీలో చేరానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుస్తుందని, తనవంతుగా టీడీపీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. 




300 కార్లతో భారీ ర్యాలీ.. 
టీడీపీలో చేరే సమయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 300 కార్లతో బయలుదేరి వెళ్లారు. భారీ బల ప్రదర్శన చేపట్టారు. ఆయనతోపాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కోటంరెడ్డి అనుచరులు కార్లలో మంగళగిరికి వచ్చారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలంతా మంగళగిరిలో ఉన్నారు, కోటంరెడ్డిని వారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 


ప్రజల్లో నిరంతరం ఉంటూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉండే వ్యక్తి గిరిధర్‌ రెడ్డి అని అన్నారు చంద్రబాబు. వైసీపీకి రాష్ట్ర సేవా దళ్ అధ్యక్షుడే రాజీనామా చేశాడంటే ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. త్వరలో మరికొంతమంది టీడీపీలో చేరతారని జోస్యం చెప్పారు చంద్రబాబు. 


కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముందుగా టీడీపీలో చేరినా శ్రీధర్ రెడ్డి కాస్త ఆలస్యంగా పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆలోగా తమ్ముడు టీడీపీలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసే విధంగా ప్లాన్ గీశారు. స్థానిక టీడీపీ నాయకుల్ని సమన్వయం చేసుకోవడం, వైసీపీ క్యాడర్ ని పూర్తిగా టీడీపీవైపు తిప్పడం, ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలను ఇప్పుడు గిరిధర్ రెడ్డి పూర్తి చేస్తారు. సరిగ్గా ఎన్నికల సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వస్తారు. 


గిరిధర్ రెడ్డిని ముందుకా టీడీపీలోకి పంపి, నెల్లూరు రూరల్ సీటు తమదేననే సిగ్నల్స్ పంపించారు శ్రీధర్ రెడ్డి. ఆ సీటుపై ఇంకెవరూ ఆశ పెట్టుకోకుండా, టీడీపీ కూడా మరెవరికీ ఆ సీటు కన్ఫామ్ చేయకుండా లాక్ చేశారు. ఇక ఇప్పటికిప్పుడు శ్రీధర్ రెడ్డి పార్టీ మారి, పసుపు కండువా కప్పుకుంటే కచ్చితంగా అనర్హత వేటు వేసేందుకు వైసీపీ రెడీగా ఉంటుంది. అందుకే ఆ పార్టీ ఎదురు చూస్తోంది. అనర్హత వేటు పడి, ఉప ఎన్నికలు వస్తే.. వాటిని ఎదుర్కోవడం కోటంరెడ్డికి కష్టసాధ్యమే. అందుకే ఆయన ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. సమయంకోసం వేచి చూస్తున్నారు. ఆలోగా నెల్లూరు రూరల్ సమస్యలపై పోరడతానంటున్నారు శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ సమస్యలకోసం ఆయన పోరాటం చేస్తే కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయి. ఆ కృషి ఎలాగూ ఆయన ఖాతాలోనే పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే.. దాన్నే ప్రధాన అజెండాగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓట్లు అడుగుతారు శ్రీధర్ రెడ్డి.