Somireddy on Chandrababu Bail: చంద్రబాబు నాయుడికి బెయిల్ తో ప్రపంచమంతా ఆనందపడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) అన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ముఖం మీద కొట్టేలా హైకోర్టు తీర్పు ఉందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయంలో పెట్టిన కేసు ఫేక్ అని తేలిపోయిందని అన్నారు. 29 తర్వాత ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెళ్తారని, ఇక వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అని అన్నారు. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నిన్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిందని బాధలో ఉన్న వారందరికీ ఈరోజు రిలీఫ్ లభించింది. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ లోనూ కండీషన్లు కొనసాగించాలని సీఐడీ వాదించినా హైకోర్టు అంగీకరించకపోవడం శుభపరిణామం. చంద్రబాబు నాయుడి స్వేచ్ఛను తగ్గిస్తే ఎన్నికల పరిణామాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని, కావున ఆయనకు నిర్బంధాల నుంచి విముక్తి కల్పిస్తున్నట్టు కోర్టు వ్యాఖ్యానించింది.
ఇది చంద్రబాబు నాయుడిపై కుట్రలు చేస్తున్న జగన్ అండ్ బ్యాచ్ ముఖం మీద కొట్టినట్టే. ఆయన బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కోలేమనే భయంతోనే పిచ్చిపిచ్చి కేసులన్నింటిని బనాయించారు. సీమెన్స్, డిజైన్ టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య జరిగిన ట్రై పార్టీ ఒప్పందానికి సంబంధించి ఓ వెండార్ సర్వీసు టాక్స్ ఎగ్గొట్టాడనే విషయాన్ని తిప్పితిప్పి చంద్రబాబు నాయుడు మీదకు తెచ్చి అక్రమ కేసు కట్టారు. సబ్ కాంట్రాక్టర్ టాక్స్ ఎగ్గొట్టిన దానికి చంద్రబాబు నాయుడు ఎలా బాధ్యుడవుతారు. కనీసం ఆ సమాచారం కూడా ఆయనకు తెలుసనే ఆధారాలు లేవని హైకోర్టు బెయిల్ తీర్పులో పేర్కొంది.
శరత్ అసోసియేట్ ఆడిటర్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై ఆధారపడి చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టారు. ఒరిజినల్ మినిట్స్ కాపీ తమకు ఇవ్వలేదని, కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే ఇచ్చారని శరత్ అసోసియేట్ చెబుతోంది. జెరాక్స్ కాపీల ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిట్ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వీటన్నింటిపై జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ తలదించుకుని సిగ్గుపడాలి. అంతిమంగా ఇది తప్పుడు కేసు అని తేలిపోయింది. జగన్ రెడ్డి సీఎం అయిన నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు అక్రమ కేసులు అల్లుతున్నారు. ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించిన చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడమేంటి?
దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్యం కుంభకోణానికి పాల్పడుతూ, దానిని ప్రశ్నించిన మా నాయకుడిపై కేసు బనాయించడం జగన్ రెడ్డి అరాచకాలకు పరాకాష్ట. లేని రింగు రోడ్డులోనూ అవినీతి అంటూ కేసు కట్టడం మరీ విచిత్రం. చంద్రబాబు నాయుడు బయట ప్రజల్లో ఉంటే ఎన్నికలను ఎదుర్కొలేమనే భయంలో జగన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఆంక్షలు లేని రెగ్యులర్ రావడంతో ఇక జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ పని అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు ట్రయల్ నడిచే సీఐడీ కోర్టులోనూ మాకు న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకం ఉంది. ఈ నెల 29వ తేదీ తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా ప్రజల మధ్యలోకి రాబోతున్నారు. జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు పదింతలుగా బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దక్కేది సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే