రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యానర్లపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 1నుంచి ఈ నిషేధం అమలులోకి రాబోతున్న సందర్భంగా ప్లాస్టిక్ బ్యానర్ల తయారీ యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ బ్యానర్లకు ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధానికి సహకరించాలని యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో కలసి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫ్లెక్సీ ప్రింటర్ల యాజమాన్యాలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, ఫ్లెక్సీ ప్రింటింగ్ సంస్థల యజమానులు పాల్గన్నారు.
ప్లాస్టిక్ వాడకం నిత్యజీవితంలో భాగమైపోయిందని, ఏ ఇంట్లో చూసినా ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా కనబడుతున్నాయని, దీనికి ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ. రీసైక్లింగ్ కి ఉపయోగపడని ప్లాస్టిక్ సంచులు అతిగా వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని, పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తారని, క్యాడ్మియం, సీసం వాడకం వలన అవి భూమిలో కలిసి పోవడం లేదన్నారు. వీటిని తిన్న జంతువులు ప్రమాదాల బారిన పడుతున్నాయని చెప్పారు. ప్రతి ఏడాది 20 లక్షల పక్షులు, జంతువులు, జలచరాలు ప్లాస్టిక్ బారిన పడి నశిస్తున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ ఆరోగ్యానికి కూడా మంచిది కాదని తెలియజేశారు. భూమిపై మరింత పచ్చదనం పెంపొందించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలన్నారు. ఇందుకోసం ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు తమ వంతు పూర్తి సహకారం అందించాలన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను ఫ్లెక్సీ బ్యానర్లలో వాడుతున్నందున వాటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. దుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ నుండి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ నుండి ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధించాలని అందుకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో సజావుగా అమలు చేసేందుకు అన్ని గ్రామాలు పట్టణాల్లో ఉన్న ఫ్లెక్సీ ప్రింటర్లు అందరూ కూడా సహకరించాలన్నారు. పర్యావరణహితమైన నూలు వస్త్రాలు పైన ఇకపై బ్యానర్లు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం నూలు వస్త్రాలపై బ్యానర్ల తయారీ ధరలు ఎక్కువగా ఉండొచ్చని రాను రాను వాడకంలో ఆ ధరలన్నీ తగ్గుతాయని భరోసా ఇచ్చారు. ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణ యజమానులకు ఆయా మండలాలు మున్సిపాలిటీలలో బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. సంబంధిత ఎంపీడీవోలకు మునిసిపల్ కమిషనర్లకు దీనిపై ఆదేశాలు ఇచ్చామన్నారు.
జిల్లా అంతా వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుండి కచ్చితంగా ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధం అమలు చేస్తామన్నారు. చట్టాన్ని అమలు చేసేందుకు రెవెన్యూ, పోలీసులు, ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు అధికారం ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ బ్యానర్లను నిల్వ ఉంచుకోవడం గాని, రవాణా చేయడం గాని, వినియోగించడం గాని చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. నూలు వస్త్రాలు తదితర ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ముమ్మరంగా చర్యలు చేపట్టాలని సంబంధిత తయారీదారులతో ఇప్పటినుండి ఉత్పత్తులు సిద్ధం చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. ఇప్పటికే ఉన్న ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లను తొలగించాలన్నారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు చట్టం సజావుగా అమలు చేసేందుకు సహకరించాలని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం వారికి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.