వైసీపీ పార్టీ పదవుల వ్యవహారం ఇప్పుడు నెల్లూరులో సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రాంతీయ సమన్వయ కర్త పదవి నుంచి తప్పించారు. ఆయనతోపాటు కొడాలి నాని, మరికొందరిని కూడా ఈ పదవుల నుంచి తప్పించినా, నెల్లూరు జిల్లా వరకు అనిల్ పదవి కోల్పోవడం గమనార్హం.


గడప గడప కార్యక్రమం తాను అనుకున్నంత విజయం సాధించలేదని ఆ మధ్య సమీక్ష సమావేశాల్లో పెదవి విరిచారు సీఎం జగన్. గడప గడపను సక్సెస్ చేసేందుకు ఎమ్మెల్యేలు మరింత కృషి చేయాలన్నారు. అదే సమయంలో వెనకబడిన కొందరికి చురకలంటించారు. అయితే నేరుగా ఎమ్మెల్యేలతోపాటు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజంగానే గడప గడపే ఈ మార్పులకి కారణమా, లేక ఇంకేదైన ఉందా అనేది తేలాల్సి ఉంది. అనిల్ ఇప్పటి వరకు తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన వద్ద నుంచి ఈ రెండు జిల్లాలను తీసేసుకుని నెల్లూరు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అప్పగించారు.


అనిల్ సామాజిక వర్గానికి న్యాయం..


నెల్లూరు జిల్లా నుంచి పార్టీ పదవిలో ఉన్న అనిల్‌ని ప్రాంతీయ సమన్వయకర్త అనే పదవి నుంచి తొలగించినా, అదే సామాజిక వర్గానికి చెందిన బీదా మస్తాన్ యాదవ్ కి బాపట్ల జిల్లా సమన్వయకర్తగా పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఒకరికి పదవి తొలగించినా, మరొకరికి అది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పదవి ఇవ్వడం గమనార్హం.


జగన్ టార్గెట్ ఏంటి..


ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలపై బలంగా ఫోకస్ పెట్టారు. ఈసారి టార్గెట్ 175 సీట్లు అంటున్నారు. ఎక్కడా ఏ నియోజకవర్గం కూడా చేజారకూడదు అనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా గడప గడప కార్యక్రమంపై నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఎమ్మెల్యేలన జనంలోకి వెళ్లాలని చెప్పారు. కానీ కొన్నిచోట్ల ఈ కార్యక్రం సక్సెస్ అయినా, మరికొన్ని చోట్ల అది ఫెయిలైంది. చాలామంది తమ తరపున ఎవరో ఒకరిని ఇంటింటికీ పంపిస్తున్నారు, మరికొందరు, ఊరిలో గ్రామ సభలాగా మీటింగ్ పెట్టి గడప గడప అయిపోయిందిపో అనేస్తున్నారు. వీరందరినీ సమన్వయం చేసుకోడానికి సమన్వయకర్తలు అనే పోస్ట్ లు ఇచ్చారు జగన్. కానీ అసలు సమన్వయకర్తలకు తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం సాధ్యం కావడంలేదు. అందుకే ఈసారి వారికి స్థానచలనం కలిగించారు. సమన్వయకర్తలను, ఇతర పార్టీ పదవుల్లో ఉన్నవారిని మార్చేశారు. నెల్లూరు జిల్లా వరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని సమన్వయకర్త బాధ్యతలనుంచి తప్పించారు.


అవమానమా..? అవకాశమా..?


అయితే అనిల్ కి ఇది అవమానమా, అవకాశమా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అనిల్ కు సమన్వయకర్తగా ఉండటంకంటే ఆయన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం చాలా అవసరం. నెల్లూరు సిటీ నియోజకగవర్గంలో 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ దశలో అనిల్ ఇతర నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి వారిని సమన్వయం చేసుకునే కంటే, సొంత నియోజకవర్గంలో పర్యటించడం మేలు. ఒకరకంగా ఇది అనిల్ కి వచ్చిన అవకాశమనే చెప్పాలి.