చంద్రబాబు అరెస్ట్ తర్వాత నిరసనల్లో నెల్లూరు జిల్లా కాస్త ప్రత్యేకంగా నిలిచింది. వాస్తవానికి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ లేకపోయినా.. వైసీపీనుంచి వచ్చి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల పార్టీకి జిల్లాలో బలం పెరిగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా నిరసన ప్రదర్శనల్లో జోరుగా పాల్గొనడంతో నెల్లూరు జిల్లాలో చంద్రబాబుకి మద్దతు పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-2 గా ఉన్న మాజీ మంత్రి నారాయణ కూడా నెల్లూరు వాసి కావడంతో.. ఇక్కడ కాస్త గట్టిగానే నిరసనలు మిన్నంటాయి. బుధవారం పోలీస్ ఆంక్షలు ఉన్నా కూడా నగరంలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీతో వైసీపీకి తలకొట్టేసినట్టయింది. సీన్ కట్ చేస్తే తెల్లారే సరికి 16మందిపై కేసులు నమోదయ్యాయి. 


చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా బుధవారం నెల్లూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే నాయకులు మాత్రం తమ తెలివితేటలు ఉపయోగించి ర్యాలీ సక్సెస్ చేశారు. ఇందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మంగళవారం రాత్రి నుంచి ఆయన పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. కానీ రూరల్ లో టీడీపీ క్యాడర్ అంతా అలర్ట్ గా ఉంది. ఆయన ఫోన్ కాల్స్ కి కూడా దూరంగా ఉన్నారు. కానీ క్యాడర్ కి ఇవ్వాల్సిన సూచలనలన్నీ పంపించారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా బుధవారం సాయంత్రానికి నెల్లూరు వీఆర్సీ సెంటర్ కి చేరుకోవాలనేది అందరి ప్లాన్. దీంతో నేతలంతా నెల్లూరులో లేనట్టే జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అందరూ నెల్లూరులోనే ఉన్నారు. పోలీసులు ముందస్తు గా హౌస్ అరెస్ట్ చేస్తారని తెలియడంతో వారు జాగ్రత్తలు తీసుకున్నారు. 


టపాకాయల సౌండ్ తో మొదలు.. 
బుధవారం సాయంత్రం వీఆర్సీ సెంటర్ ఖాళీగా ఉంది. పోలీసులకు కూడా ఏమీ అంతు చిక్కలేదు. ర్యాలీ అన్నారు, జనాలు లేరు, అసలేం జరుగుతోంది అంటూ ఆలోచించారు. అంతలో ఒక్కసారిగా టపాకాయలు పేలిన సౌండ్. టీడీపీ నేతలకు అదే సిగ్నల్. ఎక్కడెక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా వీఆర్సీ సెంటర్ కి వచ్చారు. కల్యాణ మండపాలు, హోటళ్లు, సినిమా హాళ్లలో ఉన్నవారంతా ఒక్కసారిగా టీడీపీ జెండాలు, బ్యానర్లు పట్టుకుని బాబుకోసం మేము అంటూ రోడ్లపైకి రావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అందర్నీ ఒక్కసారిగా నిలువరించడం వారికి సాధ్యం కాలేదు. 


టీడీపీ నేతలకు తోడు జనసేన, సీపీఐ నేతలు కూడా వారికి జతకలిశారు. దీంతో వీఆర్సీ సెంటర్ అంతా పసుపుమయంగా మారింది. బ్యానర్లు పట్టుకుని నాయకులు ర్యాలీగా బయలుదేరారు. నెల్లూరు నగరంలో హడావిడి సృష్టించారు. నెల్లూరు సిటీకి అనిల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా.. టీడీపీ ర్యాలీ పెద్ద ఎత్తున జరగడంతో వైసీపీకి కూడా తలకొట్టేసినట్టయింది. పోలీసులు ముందుగా హెచ్చరికలు జారీ చేసినా టీడీపీ నేతలు వెనక్కు తగ్గలేదు. ర్యాలీ జరిపి చూపించారు. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ అయింది. దీంతో పోలీసులు కేసులు పెట్టారు. మొత్తం 16మందిపై కేసులు నమోదు చేశారు. 


ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. టీడీపీ నేతలు పాశం సునీల్‌, కురుగొండ్ల రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాలేపాటి సుబ్బనాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన నాయకుడు చెన్నారెడ్డి మను క్రాంత్‌ రెడ్డి, సీపీఐ నేత దామ అంకయ్యపై కూడా కేసులు పట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ర్యాలీకి అనుమతివ్వకపోగా, ర్యాలీ చేపట్టినవారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.