కూతురు చనిపోయింది, కానీ ఆమె గుర్తులు మాత్రం చెదిరిపోకుండా చూసుకున్నాడు ఓ తండ్రి. కుమార్తె విగ్రహాన్ని తయారు చేయించి ఓ గుడి కట్టాడు. తన ఇంటిలోనే కొంత భాగాన్ని పడేసి గుడి కట్టి ఆమెకు పూజలు చేస్తున్నాడు తండ్రి. కూతురు గుర్తొచ్చినప్పుడో ఏడాదికోసారో తండ్రి ఇలా పూజలు చేస్తాడనుకుంటే పొరపాటే. ప్రతి నిత్యం ఆయన కుమార్తె గుడిలో పూజలు చేస్తారు. విగ్రహానికి హారతులిస్తారు.
ఆమె పేరు సుబ్బలక్ష్మి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ దంపతుల ఐదుగురు సంతానంలో ఆమె నాలుగో కుమార్తె. అన్నదమ్ములు, అక్క చెల్లెల్ల మధ్య అపురూపంగా పెరిగిన సుబ్బలక్ష్మి డిగ్రీ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగంలో చేరారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతుంది, ఇక వివాహం చేసుకోవాలి అనుకున్న సమయంలో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రైలు దిగి ఇంటికి వచ్చే క్రమంలో లారీ ఆమెను వెనుకనుంచి బలంగా ఢీకొంది. అన్న కళ్లముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటననుంచి ఆమె అన్న శివప్రసాద్ ఇంకా తేరుకోలేకపోతున్నారు.
తండ్రి పరిస్థితి మరీ దారుణం. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, చేతికి అంది వచ్చిన తరుణంలో అర్థాంతరంగా తనువు చాలించింది. ఆమె మరణం తర్వాత తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. నలుగురు పిల్లలున్నా ఏదో తెలియని లోటు. ఆమె ఓరోజు కలలో పనిచించిందని, తానెక్కడికీ వెళ్లలేదని, తనకు గుడి కట్టాలని చెప్పిందని అంటున్నారు తండ్రి చెంచయ్య. 2011లో ఆమెకు గుడి కట్టి పూజలు చేశాడు. నిత్యపూజలతో నేటికీ ఆమెను స్మరించుకుంటున్నాడు.
30వేల రూపాయల ఖర్చుతో సుబ్బలక్ష్మి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహానికి అభిషేకాలు చేస్తామని, ఏడాదికోసారి ఉత్సవాలు చేస్తుంటామని చెప్పారు తండ్రి చెంచయ్య. తమ కూతురు తమతోపాటే ఉందని అంటారాయన.
సుబ్బలక్ష్మికి గుడి కట్టి పూజిస్తూనే.. పక్కనే ఆంజనేయుడికి మరో గుడి కట్టించారు చెంచయ్య. ప్రతి నిత్యం అక్కడే పూజలు చేస్తూ కాలం గడుపుతుంటారు. సుబ్బలక్ష్మి సోదరుడు శివప్రసాద్ అక్కడే చిన్న కూల్ డ్రింక్ షాపు నడుపుతుంటాడు. ఆ గుడిని అంటి పెట్టుకుని తండ్రి, సోదరుడు అక్కడే ఉంటారు.
విజయవాడ చెన్నై ప్రధాన రహదారి పక్కన నెల్లూరు దాటిన తర్వాత కాకుటూరు వద్ద ఈ గుడి ఉంటుంది. ఈ గుడి గురించి తెలిసినవారు అక్కడ వాహనం ఆపి ఆ గుడి చూసి వెళ్తుంటారు. కొంతమంది సుబ్బలక్ష్మిని దేవతగా కొలుస్తుంటారని, ఆమెకు మొక్కులు చెల్లంచుకుంటుంటారని చెబుతుంటారు.
తనకంటే పిల్లల్ని గొప్పగా ప్రేమించే తల్లిదండ్రులు ఉంటారని, సంపాదన ఎక్కువ ఉన్నవారు, పిల్లలకోసం ఎంతైనా ఖర్చుపెట్టగలిగిన వారు, వారికి గుడులు కట్టించేంత స్థోమత ఉన్నవారు, విగ్రహాలు చేయించేంత డబ్బులున్నవారు చాలామంది ఉన్నారని, కానీ ఎవరూ చేయలేని, చేయని పని తాను చేసినందుకు సంతృప్తిగా ఉంటుందని చెబుతుంటారు చెంచయ్య. తన కుమార్తెకు నిత్యపూజలు చేస్తుంటానని అంటున్నారు. తనతోపాటు చాలామంది తన కుమార్తె గుడికి వస్తుంటారని, ఆమెకు నైవేద్యం చెల్లిస్తుంటారని, వారి కోర్కెలు తీరితే కచ్చితంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్నారు.