Nellore Farmer Family Protest : రాష్ట్రంలో రాజకీయ పార్టీల గ్రూపు తగాదాలు ఓ అన్నదాత కుటుంబాన్ని రోడ్డునపడేశాయి. నడిరోడ్డుపై ఆ రైతు కుటుంబం నిరసనకు దిగింది. రాజకీయాలు తమ మామిడి తోటను బలిచేశాయని ఆరోపించారు రైతు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై నుంచి వైదొలగేది లేదంటూ నిరసనకు దిగారు. రోడ్డుపై అడ్డుగా పడుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు రైతు కుటుంబ సభ్యులు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. 
రైతు పొలంలో మామిడి చెట్లు నరికివేత
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుము సముద్రంపేట మండలం పెద్ద అబ్బీపురం గ్రామంలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు వెంగయ్య అనే రైతు పొలంలోని మామిడి చెట్లు నరికివేశారు. ఈ ఘటనలో ఇంతవరకు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అనుమానితుల గురించి వివరాలు చెప్పినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ వెంగయ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి స్థానిక జనసే నేతలు మద్దతు తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఆత్మూకరు లోని బీఎస్సార్ సెంటర్లో రోడ్డుపై పడుకుని ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అక్కడినుంచి తొలగించారు. నిందితుల్ని అరెస్ట్ చేస్తామనే హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అయితే ఈ ఆందోళన జిల్లాలో సంచలనంగా మారింది. రైతు కుటుంబం రోడ్డెక్కడంతో జిల్లాలో కలకలం రేగింది. 
భారీగా ఆస్తి నష్టం
పెద్ద అబ్బీపురంలో రాజకీయ కక్షలతో కౌలురైతు వెంగయ్య పొలంలోని మామిడిచెట్లను నరికేశారు ప్రత్యర్థులు. సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఆ సమయంలో వెంగయ్య పొలంలో లేరని, లేకపోతే అతడిని కూడా మట్టుబెట్టి ఉండేవారని అంటున్నారు కుటుంబ సభ్యులు. అనుమానితులపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు విచారణ పేరుతో వారిని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ మండిపడుతున్నారు బాధితులు. 


రాయలసీమలో ఇలాంటి రాజకీయ కక్షలకు చీనీ తోటలు, మామిడి తోటలు నేలకొరిగేవి. అక్కడి సంస్కృతిని ఇప్పుడు నెల్లూరు జిల్లాకు కూడా తీసుకొచ్చారని మండిపడుతున్నారు జనసేన నాయకులు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదని అంటున్నారు. రాజకీయ కక్షలతో ఆస్తుల ధ్వంసం మంచిది కాదంటున్నారు. ఇల పగలు, ప్రతీకారాలు పెంచుకుంటూ పోతే అన్నదాతలు వ్యవసాయం చేసే వీలుండదని అంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. అయితే పోలీసులు తమకు న్యాయం చేయకపోతే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు బాధితులు. పెద్ద అబ్బీపురం ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక నాయకులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు.